మందమర్రి, నవంబర్ 29 (ప్రజావాణి):
మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడాలని అంబేద్కర్ ఆలోచనపరుల వేదిక నాయకులు జి చందర్, సుందిల్ల రాజయ్య లు తెలిపారు. శనివారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో వేదిక ఆధ్వర్యంలో పూలే వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పూలే చిత్రపటానికి పూలమాలవేసి, ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, బ్రిటిష్ పాలనలోనే సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన సంఘసంస్కర్త పూలే అని కొనియాడారు. తన భార్య సావిత్రి భాయి పూలే కు చదువు చెప్పి, దేశానికి తొలి మహిళా ఉపాధ్యాయురాలను చేసిన ఘనత ఆయనదేనని తెలిపారు. భార్యాభర్తలు ఇరువురు కలిసి 1848లో బాలికల కోసం తొలి పాఠశాల ప్రారంభించారని, 1853 వితంతు మహిళల కోసం అనాధ శిశువుల కోసం సేవాసదనం ప్రారంభించారని వివరించారు. సమాజ చైతన్యం కోసం 1873లో సత్యశోధక్ సమాజం స్థాపించారని తెలిపారు. విద్యతోనే విజ్ఞానవంతులవుతారని విషయ పరిజ్ఞానం పెరుగుతుందని విశ్వసించి, విద్యావ్యాప్తికి పూలే దంపతులు ఎంతగానో కృషి చేశారని, అస్పృశ్యత, అంటరానితనం, అసమానతలకు, అనిచివేతకు వ్యతిరేకంగా ఉద్యమించారని తెలిపారు. దేశానికి పూలే దంపతులు చేసిన సేవలు చిరస్మరణీయమని, అలాంటి మహనీయుల చరిత్ర నేటితరం అధ్యయనం చేయాలన్నారు. పూలే లాంటి పుణ్య దంపతులు మన దేశంలో లేకపోతే అక్షరాస్యత ఉండేది కాదని, ఇలాంటి మహనీయులు దేశ ప్రగతికి ప్రజా సంక్షేమానికి చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం అధ్యక్షులు సకినాల శంకర్, ఆయా సంఘాల నాయకులు రామ్ వెంకటేశ్వర్లు, మిట్టపల్లి బాబు, దాసరి రాజనర్సు, కనకం రవి, చిలుముల శ్రీనివాస్, చంద్రన్న లు పాల్గొన్నారు.
బీసీ కుల సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో….
పట్టణంలో బీసీ కుల సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో న్యాయవాదుల సమక్షంలో శనివారం మహాత్మ జ్యోతిబా పూలే వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ కుల సంఘాల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు పెద్దపల్లి సత్యనారాయణ, ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆగల్ డ్యూటీ సత్యనారాయణ లు హాజరై, ముందుగా పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయ సాధన కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ ప్రజలందరూ పాటుపడాలని, కుల వివక్ష రూపుమాపాలని పిలుపునిచ్చారు. పూలే సమాజం కోసం ఎంతో సేవ చేశారని, 1848లో పూణేలో బాలికల కోసం మొట్టమొదటి పాఠశాల ఏర్పాటు చేశారని, గులాంగిరి, సార్వజనిక సత్యధర్మం వంటి గ్రంథాలతో సామాజిక అసమానతలను ఎండగట్టారని కొనియాడారు. పూలేను ఆదర్శంగా తీసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మహిళా ప్రజలంతా రాజ్యాధికారం వైపు ప్రయాణించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు నోముల సంతోష్ గౌడ్, పోచంపల్లి శ్యామ్, గడ్డల శ్రీరాములు, చంద్రగిరి రమేష్, గోపతి రవికుమార్, సీహెచ్ సంతోష్, బీసీ సంఘం నాయకులు గాజుల ప్రతాప్, బైరాజ్ శ్రీనివాస్, ఎండి ఆఫీస్ లు పాల్గొన్నారు.

