*కర్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రి రూపురేఖలు మారుస్తాం*
*రోగులు, కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదుల మేరకే ఈ ఆకస్మిక పర్యటన*
*ఆస్పత్రిలో అణువణువూ పరిశీలించి సమస్యలు తెలుసుకున్న కలెక్టర్*
*నూతన భవనం, వర్షానికి కురుస్తున్న పాత భవనాల పరిశీలన*
*నిరుపయోగంగా ఉన్న శిథిల భవనాలను వెంటనే తొలగించాలని ఆదేశం*
*అల్ట్రాసౌండ్ స్కాన్ ఆపరేటర్ లేరని కలెక్టర్‌కు రోగుల మొర*
*కలెక్టర్‌కు ఆస్పత్రి సమస్యలను స్వయంగా వివరించిన డా ఉజ్వల్ రెడ్డి*
జహీరాబాద్, నవంబర్ 27 (ప్రజావాణి): పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి ఆసుపత్రి సౌకర్యాలు, లోపాలపై వచ్చిన ఫిర్యాదుల మేరకే తాను ఈ క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టానని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ పర్యటనలో ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సిద్ధం ఉజ్వల్ రెడ్డి ఉండి, ఆసుపత్రిలో వార్డులన్నీ తిరిగి అక్కడి దుస్థితిని, మౌలిక వసతుల లేమిని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.
*వర్షానికి కురుస్తున్న భవనాలు కూల్చివేతకు ఆదేశాలు*
ఆసుపత్రి ఆవరణలోకి అడుగుపెట్టిన కలెక్టర్.. మొదటగా నూతనంగా నిర్మిస్తున్న భవనాన్ని పరిశీలించారు. పనుల వేగంపై అధికారులను ఆరా తీశారు. అనంతరం వర్షం వస్తే కురుస్తున్న పాత భవనాలను, వార్డులను పరిశీలించి ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ మానసను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో నిరుపయోగంగా ఉన్న భవనాలను వెంటనే తొలగించి ఆ స్థలాన్ని ఆసుపత్రి అవసరాలకు సద్వినియోగం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్కాన్ ఆపరేటర్ లేరు.. వాష్ రూమ్స్ లేవు.
తనిఖీలో భాగంగా రోగులతో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడారు. ఆసుపత్రిలో అల్ట్రాసౌండ్ స్కాన్ మిషన్ ఉన్నప్పటికీ, దాన్ని ఆపరేట్ చేసే టెక్నీషియన్ (ఆపరేటర్) లేకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, బయట ప్రైవేట్ ల్యాబ్‌లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేసుకోవాల్సి వస్తోందని రోగులు కలెక్టర్ ఎదుట వాపోయారు. కర్యక్రమంలో జహీరాబాద్ తహసీల్దార్ పి దశరథ్, విద్యుత్ శాఖ అధికారులు, ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ మానస, డాక్టర్ నాగరాజ్ పాటిల్, ఇతర డాక్టర్లు, అధికారులు, సీడీసీ చైర్మన్ మహమ్మద్ ముబీన్, కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ఇమామ్ పటేల్, కాంట్రాక్ట్ కార్మికుల సూపర్వైజర్ మహమ్మద్ గౌసుద్దీన్, ఆసుపత్రి వైద్య సిబ్బంది, నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


