బాల్య వివాహ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఏకగ్రీవ తీర్మానం
దండేపల్లి, నవంబర్ 27 (ప్రజావాణి):
బాల్య వివాహాల నిర్మూలనకు గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని, గూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాలను బాల్య వివాహ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానించారు.
భారత ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ మమత, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, మాజీ ఎంపీటీసీ తోట మోహన్, డీహెచ్‌ఈడబ్ల్యూ జెండర్ స్పెషలిస్ట్ విజయ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాల్య వివాహాలను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకోవడం, గ్రామస్థాయి కమిటీల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టడం, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, సామాజిక ప్రదేశాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించారు. బాల్య వివాహాలకు దారితీసే పరిస్థితులు ఉన్న బలహీన కుటుంబాలను గుర్తించి కౌన్సెలింగ్‌తో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలవాలని నిర్ణయించారు. ప్రత్యేక శిక్షణ పొందిన సామాజిక స్వచ్ఛంద కార్యకర్తలు, క్షేత్రస్థాయి సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని పేర్కొన్నారు.
బాల్య వివాహాలు బాలికల భవిష్యత్తును దెబ్బతీస్తాయని, వాటి నిర్మూలనకు ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు సమష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి గూడెం గ్రామ పంచాయతీని బాల్య వివాహ రహిత పంచాయతీగా తీర్చిదిద్దాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కమలాకర్, పల్లె దవాఖానా వైద్యురాలు డాక్టర్ శ్రీవాణి, పశువైద్యాధికారి డాక్టర్ నరేష్, అంగన్‌వాడీ టీచర్లు శైలజ, స్వప్న, రమాదేవి, వసంత, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

