జనగామ ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 26 (ప్రజావాణి): భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం జనగామ జిల్లా చౌరస్తాలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం అందించిన స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం నేటికీ దేశానికి మార్గదర్శకమని అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలే మనకు మార్గదర్శకమని, ఆ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవడంతో పాటు, పౌరులుగా మన బాధ్యతలను కూడా నిర్వర్తించాలని పేర్కొన్నారు.
అంబేద్కర్ చేసిన సేవలు, ఆయన పోరాటం వల్లనే నేడు దళితులు, బహుజనులు, అణగారిన వర్గాలకు రాజ్యాంగపరంగా సమాన హక్కులు దక్కాయని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని భావితరాలకు అందించాలని, యువత రాజ్యాంగం గురించి అవగాహన పెంచుకోవాలని సూచించారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించడం కేవలం ఒక కార్యక్రమం కాదని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే సంకల్పమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు దళితరత్న తిప్పారపు విజయ్, శేకర్, ముసిపట్ల విజయ్, ఇరుగు సిద్దులు, బాలు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

