గిరిజన యువతకు నైపుణ్య శిక్షణతో మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలి: ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో
ఏటూరునాగారం నవంబర్ 26,ప్రజావాణి:
గిరిజన, గ్రామీణ ప్రాంతాల యువతకు నాణ్యమైన నైపుణ్య శిక్షణ అందించి, వారికి ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా శిక్షణ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో సంబంధిత అధికారులకు సూచించారు. ఈ మేరకు పీఓ ఆదేశాల ప్రకారం ఏపీఓ (జనరల్) రాంబాబు ములుగు మండల కేంద్రంలోని శిక్షణ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ నిర్వహిస్తున్న వివిధ నైపుణ్య శిక్షణ కార్యక్రమాల పురోగతిని పరిశీలించారు.
ఈ సందర్భంగా డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, టైలరింగ్ కోర్సులకు సంబంధించిన శిక్షణ తరగతులను పరిశీలించారు. శిక్షణ పొందుతున్న యువతీ యువకులతో మాట్లాడి, వారికి అందుతున్న శిక్షణ, అభ్యాస విధానం, కోర్సుల ద్వారా కలిగే ఉపాధి అవకాశాల గురించి వివరాలు తెలుసుకున్నారు.
శిక్షణార్థులు అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని, శిక్షణలో పూర్తి నైపుణ్యం సాధించాలని ఏపీఓ సూచించారు. శిక్షణ కేవలం సర్టిఫికెట్ పొందడానికే పరిమితం కాకుండా, వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకొని ఉద్యోగాలు పొందేందుకు, స్వయం ఉపాధి ప్రారంభించేందుకు ఉపయోగపడాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా అభ్యర్థులకు యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. శిక్షణ అనంతరం అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అవసరమైన మార్గదర్శకత్వం, సహకారం అందించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.
గిరిజన యువతలో ఉన్న ప్రతిభను గుర్తించి, వారికి సరైన శిక్షణ, మార్గదర్శకత్వం అందించడం ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించేలా ఐటీడీఏ ప్రత్యేక దృష్టి సారిస్తోందని పీఓ లెనిన్ వత్సల్ టోప్పో పేర్కొన్నారు. శిక్షణ కేంద్రాల్లో కోర్సుల నిర్వహణ, శిక్షణ నాణ్యత, అభ్యర్థుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జేడీఎం కొండలరావు, ములుగు సెంటర్ మేనేజర్ కొల్లూరి క్రాంతి కుమార్, శిక్షణ కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

