రాజ్యాంగ విలువల పరిరక్షణలో యువత కీలక పాత్ర పోషించాలి
విద్యార్థుల్లో ప్రజాస్వామ్య స్పూర్తిని పెంపొందించడమే లక్ష్యం
జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొంకూరి అవినాష్
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా వ్యాసరచన పోటీలు
ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, నవంబర్ 26
భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ముఖ్యంగా యువత రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో క్రియాశీలక పాత్ర పోషించాలని జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొంకూరి అవినాష్ అన్నారు.
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్దపల్లిలోని మదర్ థెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బొంకూరి అవినాష్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన హక్కులు, బాధ్యతలతో పాటు సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం వంటి గొప్ప విలువలపై విద్యార్థులకు సంపూర్ణ అవగాహన ఉండాలని సూచించారు.
నేటి యువత రాజ్యాంగంలోని ఆశయాలను, ప్రజాస్వామ్య విలువలను అర్థం చేసుకుని వాటి పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, విద్యార్థి దశ నుంచే దేశభక్తి, సామాజిక బాధ్యత, ప్రజాస్వామ్య భావాలను అలవర్చుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థుల్లో రాజ్యాంగంపై అవగాహన పెంపొందించడంతో పాటు వారిలో సృజనాత్మకత, సామాజిక స్పృహను పెంపొందించాలనే ఉద్దేశంతో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించి బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అక్కనపెల్లి క్రాంతికుమార్, తూముల సుభాష్, పట్టణ అధ్యక్షుడు శ్రావణ్, యూత్ కాంగ్రెస్ నాయకులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

