పర్మిట్ లేకుండా వాహనాలు నడిపితే సెక్షన్ 192ఏ కింద చర్యలు
రూ.10 వేల వరకు జరిమానా.. తిరుపతి జిల్లాలో ప్రత్యేక తనిఖీలు
ఆటోలు, మోటార్ క్యాబ్ యజమానులు వెంటనే పర్మిట్లు పొందాలి: జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్
తిరుపతి/ప్రజావాణి:
పర్మిట్ లేకుండా రవాణా వాహనాలను రహదారులపై నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ హెచ్చరించారు. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 192ఏ కింద కేసులు నమోదు చేసి రూ.10 వేల వరకు జరిమానా విధించడంతో పాటు నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
జిల్లాలో పలువురు వాహన యజమానులు ఆన్లైన్ ద్వారా తమ వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పటికీ, సంబంధిత రవాణా పర్మిట్లు పొందకుండానే వాహనాలను నడుపుతున్నట్లు రవాణా శాఖ దృష్టికి వచ్చిందన్నారు. ముఖ్యంగా మోటార్ క్యాబ్స్, ఆటోరిక్షాల యజమానులు పర్మిట్ నిబంధనలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు.
వాహనాన్ని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం మాత్రమే సరిపోదని, సంబంధిత వాహన తరగతికి వర్తించే నిబంధనల ప్రకారం తప్పనిసరిగా పర్మిట్ పొందాలని తెలిపారు. పర్మిట్ లేకుండా రవాణా వాహనాలను నడపడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.
అంతేకాకుండా, చట్టబద్ధమైన అనుమతులు లేకుండా వాహనాన్ని నడిపే సమయంలో ప్రమాదం సంభవిస్తే బీమా క్లెయిమ్ విషయంలోనూ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. దీనివల్ల వాహన యజమానులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.
వాహన యజమానుల సౌకర్యార్థం సంబంధిత పర్మిట్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామని, నిర్ణీత ప్రభుత్వ ఫీజులు చెల్లించి వర్తించే నిబంధనల ప్రకారం ఐదు సంవత్సరాల వరకు పర్మిట్ పొందవచ్చని వివరించారు.
ఇప్పటివరకు పర్మిట్లు పొందని ఆటోరిక్షాలు, మోటార్ క్యాబ్స్, ఇతర ప్రయాణికుల రవాణా వాహనాల యజమానులు వెంటనే ఆన్లైన్ ద్వారా పర్మిట్లు పొందాలని సూచించారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, పర్మిట్లు లేకుండా వాహనాలు నడిపే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ స్పష్టం చేశారు.
వాహన యజమానులు రవాణా నిబంధనలను తప్పనిసరిగా పాటించి, తమ వాహనాలకు అవసరమైన అన్ని అనుమతులు పొందిన తరువాతే రహదారులపై నడపాలని ఆయన కోరారు.
పర్మిట్ లేకుండా వాహనాలు నడిపితే సెక్షన్ 192ఏ కింద చర్యలు
RELATED ARTICLES

