📄 ePaper
5pm
7pm
Thursday, November 26, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణMuluguవేదికలు వేరైనా ఉద్యమకారుల ఆశయం ఒక్కటే

వేదికలు వేరైనా ఉద్యమకారుల ఆశయం ఒక్కటే

📰 Generate e-Paper Clip

 

– పోలోజు రామూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి.

ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)

ములుగు మండల కేంద్రంలో ఉద్యమకారుల ఐక్యవేదిక ములుగు మండల అధ్యక్షులు నాగపురి హరినాథ్ అధ్యక్షతన జరిగిన ఉద్యమకారుల సమావేశానికి ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు పోలోజు రామూర్తి, రేండ్ల సంతోష్ హాజరయ్యారు.

ములుగు పట్టణ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఉద్యమ సీనియర్ నాయకుడు గొంగల్ల కట్టయ్యను సత్కరించి, ఆహ్వానం పలికారు.

పోలోజు రామూర్తి మాట్లాడుతూ… మనమంతా తెలంగాణ కోసం పోరాడాం. ఇప్పుడు మన హక్కుల కోసం, మన ఆత్మగౌరవం కోసం ఒక్కటిగా ముందుకు సాగాల్సిన సమయం వచ్చింది.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో ఏళ్లపాటు ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు, త్యాగాలు భరించిన చరిత్ర మన ఉద్యమకారులది. మన పోరాట ఫలితంగానే స్వరాష్ట్రం సాకారమైంది. అలాంటి ఉద్యమకారుల త్యాగాలకు తగిన గుర్తింపు, గౌరవం, సంక్షేమం లభించాలన్నదే మనందరి ఆకాంక్ష.

ఈ లక్ష్య సాధనలో మన మధ్య సంఘాలు వేరైనా, వేదికలు వేరైనా, మనందరి ఆశయం ఒక్కటే కావాలి. ఎవరూ ఎవరికీ ప్రత్యర్థులు కాదు. మనమంతా ఒకే ఉద్యమ వారసులం. మన మధ్య విభేదాలకు, వర్గాలకు, భేదాభిప్రాయాలకు తావివ్వకుండా పరస్పర గౌరవంతో ఒకే గొంతుకగా ముందుకు సాగాలి.

ఈ గొప్ప లక్ష్యంతోనే ‘తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక’ ఉద్యమకారుల హక్కులు, ఆత్మగౌరవం, సంక్షేమం కోసం తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఈ వేదిక ఒకరిదో, ఒక సంఘానిదో కాదు… ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిదీ.

ఈ ప్రయాణంలో ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమల్ల రవికుమార్ గారు ఉద్యమకారుల సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, వారి హక్కులు మరియు న్యాయం కోసం తన వంతు కృషి చేస్తున్నారు.

కావున వివిధ ఉద్యమ సంఘాల్లో, ఇతర వేదికల్లో కొనసాగుతున్న ఉద్యమకారులందరికీ మన ఆత్మీయ ఆహ్వానం అందిస్తున్నాం. మీరు ఏ సంఘంలో ఉన్నా, ఏ వేదికలో పనిచేస్తున్నా, మీ అనుభవానికి, మీ పోరాటానికి, మీ త్యాగాలకు మా గౌరవం ఎప్పుడూ ఉంటుంది.

మన ఐక్యత మన బలం!
మన ఐక్యత మన ఆత్మగౌరవం!
మన ఐక్యతే మన హక్కుల సాధనకు పునాది!

ఉద్యమకారులంతా కలిసి నడిచి, మన త్యాగాలకు తగిన గుర్తింపు, మన కుటుంబాలకు గౌరవం, మన ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు ఐక్యంగా మన గొంతుక వినిపిద్దాం అని పోలోజు రామూర్తి, రేండ్ల సంతోష్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సన్నగుండ్ల వెంకటేశ్వర్లు, జిల్లా ప్రచార కార్యదర్శి ఎలిమిల్ల రఘు, మంగపేట మండల గౌరవ అధ్యక్షులు పప్పు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.