దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలి
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్.. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పిలుపు
బెజ్జంకి,నవంబర్ 24 (ప్రజావాణి)
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.ఈ నెల 29న కరీంనగర్ జిల్లా అల్గునూరు చౌరస్తా సమీపంలోని కేసీఆర్ దీక్షా ప్రాంగణంలో నిర్వహించనున్న దీక్షా దివస్ స్ఫూర్తి మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.మంగళవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వినోద్ కుమార్, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ,ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అన్ని రంగాల్లో వివక్షకు గురికావడంతో ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యమం ప్రారంభమైందని వినోద్ కుమార్ తెలిపారు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిందన్నారు.దీక్షా దివస్ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగిన రోజని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదని, రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయని విమర్శించారు.తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ నాయకత్వం అవసరమని అన్నారు.మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. ఈ నెల 29న అల్గునూరులో నిర్వహించే దీక్షా దివస్ మహాసభకు బెజ్జంకి మండలం నుంచి మూడు వేల మందిని తరలించి సభను విజయవంతం చేస్తామని తెలిపారు. ఈ మహాసభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు,సీనియర్ నాయకులు లింగాల లక్ష్మణ్, కనగండ్ల తిరుపతి, చింతకింది శ్రీనివాస్ గుప్తా, పలువురు సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
