మాట నిలబెట్టుకున్న పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
కాటారం గురుకుల విద్యార్థులకు రూ.35 వేల విలువైన క్రీడా సామాగ్రి పంపిణీ
ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి నవంబర్ 24
విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాటారం మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులకు క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆదేశాల మేరకు స్థానిక కాంగ్రెస్ నాయకుల చేతుల మీదుగా విద్యార్థులకు ఈ సామాగ్రిని అందజేశారు.
ఇటీవల గురుకుల పాఠశాలను సందర్శించిన ఎంపీ వంశీకృష్ణ విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు క్రీడా సామాగ్రి అందించాలని ఎంపీని కోరారు. వారి అభ్యర్థనకు స్పందించిన ఎంపీ దాదాపు రూ.35 వేల విలువైన క్రీడా సామాగ్రిని అందించాలని ఆదేశించారు. దీంతో విద్యార్థులకు వాలీబాల్ నెట్, వాలీబాల్స్, క్యారమ్ బోర్డులు, చెస్ బోర్డులు, క్రికెట్ కిట్ అందజేశారు.
చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని, వారి ప్రతిభను వెలికితీసేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించాలని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.
విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ ప్రాంతంలో ఇప్పటికే అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కాకా వెంకటస్వామి ఆశయాలను కొనసాగిస్తూ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రజాసేవ, సంక్షేమం, విద్యాభివృద్ధి వంటి రంగాల్లో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.
విద్యార్థుల అవసరాలను గుర్తించి స్పందించి క్రీడా సామాగ్రి అందించిన ఎంపీ వంశీకృష్ణకు హాస్టల్ విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బండం వసంత రెడ్డి, జావేద్ ఖాన్, మాల మహానాడు జిల్లా యువజన అధ్యక్షుడు సకినాల ప్రశాంత్, తొంబర్ల రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

