*మేడ్చల్ బస్టాండ్లో పోలియో చుక్కల కార్యక్రమం*
*చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ఆర్టీసీ పిలుపు*
*నిండు జీవితానికి రెండు చుక్కలు.. పోలియో చుక్కలు*
మేడ్చల్ (ప్రజావాణి):- చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం పోలియో చుక్కలు వేయించడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత అని టీజీఎస్ఆర్టీసీ మేడ్చల్ డిపో అధికారులు పిలుపునిచ్చారు. మేడ్చల్ డిపో పరిధిలోని మేడ్చల్ బస్టాండ్ ప్రాంగణంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, పోలియో వ్యాధి నుంచి పిల్లలను రక్షించి అంగవైకల్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. రెండు పోలియో చుక్కలు చిన్నారుల జీవితానికి రక్షణగా నిలుస్తాయని, పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
రెండు చుక్కల నిర్లక్ష్యం.. జీవితకాలపు బాధ కావొద్దు” అనే సందేశంతో ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని, ఆరోగ్యమే మహాభాగ్యమని గుర్తించి పిల్లల ఆరోగ్య పరిరక్షణకు తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మేడ్చల్ బస్టాండ్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగస్వాములై చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు సహకరించిన వైద్య సిబ్బంది, అధికారులు, ఆర్టీసీ సిబ్బంది, తల్లిదండ్రులకు టీజీఎస్ఆర్టీసీ మేడ్చల్ డిపో తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పోలియో రహిత భారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని డిపో మేనేజర్ కోరారు.

