60 ఏళ్ల పవిత్ర సింధూరం భక్తుల ఆస్తి: ఈవో అంజనా రెడ్డి
కొండగట్టు ఆంజనేయస్వామి నిజరూప దర్శనానికి భక్తులకు ఆహ్వానం
మల్యాల, నవంబర్ 21 (ప్రజావాణి): కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో మూలవిరాట్టుపై నుంచి తొలగించిన పవిత్ర సింధూరాన్ని నేటి నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆలయ ఈవో అంజనా రెడ్డి తెలిపారు. స్వామివారు సుమారు 60 ఏళ్లుగా తన ఒంటిపై ధరించిన పవిత్ర సింధూరం భక్తుల ఆస్తి అని ఆమె పేర్కొన్నారు.
స్వామివారి నిజరూప దర్శనం చేసుకునే ప్రతి భక్తుడు ఈ పవిత్ర సింధూరాన్ని బొట్టుగా ధరించుకుని వెళ్లాలని సూచించారు. డిసెంబర్ 29వ తేదీ వరకు నిజరూప దర్శనాలు కొనసాగనున్న నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్షేమంగా వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందాలని ఈవో అంజనా రెడ్డి విజ్ఞప్తి చేశారు.

