కలగానే మిగులుతున్న ఏజెన్సీ డిగ్రీ కళాశాల ఏర్పాటు హామీ!
చర్లలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తక్షణమే ఏర్పాటు చేయాలి
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చాలి: విద్యార్థి రక్షణ సంఘం డివిజన్ అధ్యక్షుడు బోయిళ్ల సాంబశివరావు
ప్రజావాణి – చర్ల, నవంబర్ 20: ఏజెన్సీ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారుతోందని, చర్ల మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తక్షణమే ఏర్పాటు చేయాలని విద్యార్థి రక్షణ సంఘం డివిజన్ అధ్యక్షుడు బోయిళ్ల సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థి రక్షణ సంఘం నాయకులు చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. అనంతరం సాంబశివరావు మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటూ క్రమం తప్పకుండా కళాశాలకు హాజరై ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
వెంకటాపురం, వాజేడు, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు లేకపోవడంతో ఇంటర్మీడియట్ పూర్తయిన అనేకమంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత పేద విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకునే ఆర్థిక స్థోమత లేక చదువులకు స్వస్తి పలుకుతున్న పరిస్థితి నెలకొందన్నారు.
ఏళ్ల తరబడి విద్యార్థులు, ప్రజలు డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం పోరాటాలు చేస్తున్నప్పటికీ పాలకుల నుంచి సరైన స్పందన రావడం లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుకు నోచుకోవడం లేదన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సైతం చర్లలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని, ఇప్పటివరకు ఆ హామీ నెరవేరకపోవడం విచారకరమన్నారు.
ప్రజా ప్రభుత్వంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా స్పందించి చర్ల మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేసి ఏజెన్సీ విద్యార్థుల ఉన్నత విద్యకు బాటలు వేయాలని కోరారు. లేనిపక్షంలో విద్యార్థులు, ప్రజలు, మేధావులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి రక్షణ సంఘం నాయకులు రుద్ర, ప్రశాంత్, గోవింద్, కృపాకర్ తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.



