ప్రేమించిన యువతికి న్యాయం చేయాలి.. అనితకు మాల మహానాడు నాయకుల మద్దతు
దండేపల్లి, నవంబర్ 20 (ప్రజావాణి):
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో ప్రియుడు గౌతమ్ ఇంటి ఎదుట గత రెండు రోజులుగా దీక్ష చేస్తున్న అనితకు మాల మహానాడు మండల నాయకులు మద్దతు తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. గౌతమ్ అనే యువకుడు అనితను గత మూడు సంవత్సరాలుగా ప్రేమిస్తూ, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు వివాహానికి నిరాకరిస్తున్నాడని అనిత ఆరోపిస్తోంది. తమ కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదని, కులం అడ్డొస్తోందని చెబుతూ పెళ్లికి నిరాకరించడంతో తనకు న్యాయం చేయాలని ప్రియుడి ఇంటి ఎదుట దీక్ష చేపట్టింది.
ఈ నేపథ్యంలో మాల మహానాడు మండల నాయకులు అనితకు మద్దతుగా నిలిచి, ఇరు కుటుంబాల సభ్యులు చర్చించుకుని వివాహానికి అంగీకరించాలని కోరారు. లేనిపక్షంలో రెండు రోజుల తర్వాత జిల్లా వ్యాప్తంగా ఉన్న దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల అధ్యక్షుడు మా దయాకర్, మండల ఉపాధ్యక్షుడు రాపల్లి వసంతయ్య, ఎస్సీ సంక్షేమ సంఘం నాయకులు కొండ నరేష్, మంత్రి శ్రీనివాస్, బొల్లం రవీందర్, మంత్రి కమలాకర్, ధార నరసయ్య, వేముల నరసయ్య, నీరటి అఖిల్, మేక మున్ని, కురుమట్ల పవన్ తదితరులు పాల్గొన్నారు.

