*నల్గొండ లో మున్సిపల్ కాంట్రాక్ట్ స్వీపర్ పై దాడి – ఎస్సీ / ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు*
*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో కాంట్రాక్ట్ స్వీపర్ గా పనిచేస్తున్న దళిత మహిళపై దాడి జరిగిన ఘటన నల్గొండలో కలకలం రేపింది. గురువారం ఉదయం సుమారు 08:05 గంటలకు బాధితురాలు (వయస్సు 45) తన తోటి లేబర్ తో కలిసి మున్సిపల్ ట్రాక్టర్ పై చెత్త సేకరణ విధుల నిమిత్తం మిర్యాలగూడ రోడ్డులోని ఆనంద్ నగర్ 45వ మున్సిపల్ డివిజన్ కు వెళ్లారు. ఆమె విధుల్లో భాగంగా ఇళ్ల వద్ద చెత్త సేకరిస్తుండగా, అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇంటి ముందు ఉన్న ఇసుక బస్తాను ఎందుకు తొలగించలేదంటూ వివాదానికి దిగారని, ఆ క్రమంలో అసభ్య పదజాలంతో దూషించడం తో పాటు కులం పేరుతో దూషించి, కర్రతో కాళ్లపై కొట్టినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దాడిలో గాయపడిన మహిళను సహోద్యోగులు వెంటనే రక్షించి చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ / ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలిపై దాడి జరగడంపై పారిశుద్ధ్య కార్మిక సంఘాలు, దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

