జాతీయ రహదారి భద్రతా మండలి సభ్యునిగా మబ్బు సూర్యనారాయణ రెడ్డి నియామకం తిరుపతికి గర్వకారణం
జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఘన సన్మానం
తిరుపతి, నవంబర్ 16: కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్ (NRSC) నాన్-ఆఫీషియల్ కో-ఆప్టెడ్ సభ్యునిగా తిరుపతికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక సేవకులు మబ్బు సూర్యనారాయణ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో అధికారులు ఆయనను దుశ్శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, ప్రత్యేకించి తిరుపతి నగరానికి చెందిన వ్యక్తికి జాతీయ స్థాయిలో కీలకమైన బాధ్యత లభించడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. రహదారి ప్రమాదాల నివారణ, ప్రమాదాల విశ్లేషణ, రహదారి భద్రతా ప్రమాణాల మెరుగుదల వంటి అంశాల్లో జాతీయ స్థాయిలో విధానపరమైన సూచనలు అందించే సలహా మండలిలో తిరుపతి ప్రాంతానికి ప్రాతినిధ్యం లభించడం విశేషమని పేర్కొన్నారు.
రహదారి ప్రమాదాలకు మానవ తప్పిదాలు, రహదారి నిర్మాణ లోపాలు, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, రహదారి నియమాలపై అవగాహన లేకపోవడం వంటి అనేక కారణాలు ఉన్నాయని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రమాదాల స్వభావాన్ని అధ్యయనం చేసి, వాటి నివారణకు అవసరమైన సూచనలను జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో సూర్యనారాయణ రెడ్డి భాగస్వామ్యం ఉపయోగకరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మబ్బు సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, నేషనల్ రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సభ్యునిగా దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గణాంకాలు, ప్రమాదాలకు దారితీస్తున్న కారణాలు, బ్లాక్ స్పాట్స్ తదితర అంశాలపై అధ్యయనం చేసి నివారణ చర్యలకు సూచనలు అందిస్తానని తెలిపారు. రోడ్డు ఇంజనీరింగ్ మెరుగుదలతో పాటు పోలీసు, రవాణా, జాతీయ రహదారుల సంస్థ, వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ తదితర విభాగాల మధ్య సమన్వయంతో ప్రమాదాల నివారణకు కార్యాచరణ రూపొందించేందుకు తగిన సూచనలు అందిస్తానని పేర్కొన్నారు.
సీనియర్ మోటార్ వాహన తనిఖీ అధికారి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, మబ్బు సూర్యనారాయణ రెడ్డి వ్యాపార రంగంలో రాణించడంతో పాటు అనేక సంవత్సరాలుగా ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారని తెలిపారు. ఆయన అనుభవం, సేవాభావం జాతీయ రహదారి భద్రతా రంగానికి ఉపయోగపడాలని ఆకాంక్షించారు. ప్రజలను రహదారి భద్రతా కార్యక్రమాల్లో భాగస్వాములను చేసి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మోటార్ వాహన తనిఖీ అధికారులు శ్రీనివాసరావు, స్వర్ణలత, ప్రసాద్ వర్మ, పరిపాలన అధికారులు విజయ్ కుమార్, విజయ ప్రశాంతి, రవాణా శాఖ సిబ్బంది పాల్గొని మబ్బు సూర్యనారాయణ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.


