*కష్టంలో ఉన్న గీత కార్మికుడికి గౌడ సంఘం భరోసా*
-భయపడకు సాయిలు, మేమున్నాం – గౌడ సంఘం నాయకుల పరామర్శ.
-తాటి చెట్టు నుంచి పడ్డ సాయిలుకు ఆర్థిక భరోసా.
-గీత కార్మికుడికి అండగా గౌడ సంఘం.
*ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*:-
ములుగు జిల్లా వెంకటాపుర్ (రామప్ప) మండలం
లక్ష్మీదేవిపేట గ్రామంలో తెల్లవారకముందే లేచి తాటి చెట్టు ఎక్కడం మండ సాయిలుకు అలవాటు. కుటుంబం కోసం, కల్లు గీసి బతుకు బండి నడిపే గీత కార్మికుడు ఆయన.
ఆ రోజు కూడా అలాగే చెట్టు ఎక్కాడు. కానీ ఒక్క క్షణంలో కాలు జారింది. ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. గాయాలతో విలవిల్లాడుతున్న సాయిలును చూసి కుటుంబం కన్నీరు పెట్టింది.
విషయం తెలిసిన వెంటనే గౌడ సంఘం నాయకులు ఆగలేదు. జిల్లా అధ్యక్షులు గుండబోయిన రవి గౌడ్, ఉపాధ్యక్షులు దొమ్మటి సదయ్య, లక్ష్మీదేవిపేట అధ్యక్షులు గట్టు శంకర్, పబ్బ శివరాజ్ గౌడ్ నేరుగా ఆయన ఇంటికి వెళ్లారు.
“భయపడకు సాయిలు, మేమున్నాం” అని భుజం తట్టి ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందేలా చూస్తామని, ఆర్థికంగా అండగా ఉంటామని మాట ఇచ్చారు.
ఒక కార్మికుడు కష్టంలో ఉంటే సంఘం మొత్తం కుటుంబంలా నిలబడటం అంటే ఇదే. చెట్టు మీద నుంచి పడిన సాయిలుకు ఇప్పుడు సంఘం అనే పెద్ద చెట్టు నీడనిచ్చింది.
గీత కార్మికుల క్షేమం కోసం మేము ఎప్పుడూ ముందుంటామని నాయకులు చెప్పిన మాట, ఆ కుటుంబానికి కొండంత భరోసా ఇచ్చింది.

