దివ్యాంగులకు అండగా సుందర్ చారిటబుల్ ట్రస్ట్..!
మాజీ మంత్రి ఎర్రబెల్లి ఆదేశాలతో నడవలేని స్థితిలో ఉన్న ఇద్దరికి వీల్‌చైర్లు అందజేత
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 15 (ప్రజావాణి):
ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ, దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా సుందర్ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది.
ఇందులో భాగంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు దేవరుప్పుల మండల కేంద్రంలోని కొత్తవాడకు చెందిన తొలుపునూరి యాకయ్య కుమారుడు సిద్దు, అదే ప్రాంతానికి చెందిన జోగు మైసయ్య ల కు ట్రస్ట్ చైర్మన్ ఏల సుందర్ స్వయంగా వీల్ చైర్స్ అందించి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.
చిన్నతనం నుంచి అంగవైకల్యంతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న సిద్దుతో పాటు జోగు మైసయ్యకు వీల్‌చైర్లు అందించడం ద్వారా వారి కదలికలకు కొంతమేర వెసులుబాటు కల్పించారు. దివ్యాంగుల కష్టాలను గుర్తించి, వారికి అవసరమైన సహాయాన్ని అందించడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.
స్వచ్ఛంద సేవా కార్యక్రమాల ద్వారా ఆపన్నులకు అండగా నిలుస్తూ, సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్న ఏల సుందర్‌పై బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందనలు కురిపించారు. కష్టాల్లో ఉన్నవారికి సహాయం అందిస్తూ మానవత్వాన్ని చాటుతున్న ట్రస్ట్ సేవలను కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపారు.
సుందర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతూ ఏల సుందర్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, తన సేవా కార్యక్రమాలతో ఎంతోమందికి అండగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తోటకూరి కిష్టయ్య, తోటకూరి రామచంద్రు, రెడ్డిరాజుల అబ్బసాయిలు, ఆలకుంట్ల వెంకన్న, నీలారపు పెద్ద వెంకన్న, పలుసం నరసింహులు, ఆలకుంట్ల మహేష్, దూలం నరేష్, దుంపల సంపత్, ఓర్సు ఐలయ్య, కారుపోతుల వెంకన్న, రాసాల చరణ్ సాయి, పర్రెపాటి యాకస్వామి, అలకుంట్ల మల్లయ్య, అలకుంట్ల సందీప్, భాషిపాక కరుణాకర్, ఉప్పుల సామ్రాట్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

