నెహ్రూ ఆశయాలే నవభారత నిర్మాణానికి స్ఫూర్తి .. మహాదేవుని శ్రీనివాస్
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 14 (ప్రజావాణి): దేశ తొలి ప్రధానమంత్రి, ఆధునిక భారతదేశ నిర్మాత, భారత రత్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ 137వ జయంతి సందర్భంగా శుక్రవారం కొమురవెల్లి మండల కేంద్రంలో ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం నిర్వహించారు.
కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి, పూలు చల్లి ఘన నివాళులర్పించారు. అనంతరం నెహ్రూ గారి జయంతిని పురస్కరించుకుని జరుపుకుంటున్న బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహాదేవుని శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆధునిక భారతదేశాన్ని నిర్మించడంలో నెహ్రూ చూపిన దూరదృష్టి అనిర్వచనీయమని అన్నారు.
విద్య, విజ్ఞానం, శాస్త్ర సాంకేతిక రంగాలు, పరిశ్రమలు, వ్యవసాయం, ఆరోగ్యం వంటి అన్ని రంగాల అభివృద్ధికి ఆయన వేసిన బలమైన పునాదులే నేటి భారత ప్రగతికి బాటలు వేశాయని పేర్కొన్నారు. ఐఐటీలు, ఐఐఎంలు, అణు పరిశోధనా సంస్థలు, భారీ పరిశ్రమలు, డ్యాముల నిర్మాణం వంటివన్నీ నెహ్రూ గారి దూరదృష్టికి నిదర్శనమని అన్నారు.
నెహ్రూ గారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమానత్వం, లౌకికవాదం, ప్రజాస్వామ్య స్ఫూర్తితో, కుల మతాలకు అతీతంగా దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నేటి యువత నెహ్రూ గారి జీవితాన్ని, ఆయన రచనలను చదివి స్ఫూర్తి పొందాలని సూచించారు.
ప్రతి చిన్నారిలోనూ అపారమైన ప్రతిభ, సృజనాత్మకత, నూతన ఆలోచనలు దాగి ఉంటాయని నెహ్రూ గారు గట్టిగా విశ్వసించేవారని గుర్తుచేశారు. పిల్లలంటే ఆయనకు ఎనలేని ప్రేమని, అందుకే ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు.
బాలల హక్కులను పరిరక్షిస్తూ, వారి ప్రతిభను ప్రోత్సహిస్తూ, భయం లేని బాల్యాన్ని అందించి, వివక్షకు తావులేని సమాజాన్ని నిర్మించడం మనందరి బాధ్యత అని అన్నారు. పిల్లలకు కేవలం పుస్తకాల జ్ఞానమే కాకుండా విలువలతో కూడిన విద్యను, మానవతా విలువలను, దేశభక్తిని అందించినప్పుడే నెహ్రూ ఆశయాలకు నిజమైన నివాళి అని మహాదేవుని శ్రీనివాస్ పేర్కొన్నారు.
బాలలే రేపటి భారతదేశ భవిష్యత్తు అని, వారిని సరైన మార్గంలో నడిపించి, మంచి పౌరులుగా తీర్చిదిద్దితేనే బలమైన భారతదేశాన్ని నిర్మించగలమని అన్నారు.
ఈ కార్యక్రమంలో కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల, గ్రామ శాఖ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


