పిల్లల చదువుపై కలెక్టర్ ఆరా.. భవిష్యత్తుపై భరోసా!
తరగతి గదిలో విద్యార్థులతో ముఖాముఖి!
చదువులో వెనుకబడిన వారిని గుర్తించాలని ఆదేశం!
మానుకోట విద్యా ఫలితాలే లక్ష్యం..
కేసముద్రం నవంబర్ 12,ప్రజావాణి.
విద్యార్థుల భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది.. వారికి అందే విద్యా ప్రమాణాలే రేపటి సమాజ ప్రగతికి పునాది. అందుకే ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందుతోందా? చదువులో ఎదురవుతున్న ఇబ్బందులేమిటి? బోధించిన పాఠాలు ఎంతవరకు అర్థమవుతున్నాయి? అనే అంశాలను తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ స్వయంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లారు. అధికారుల నివేదికలకే పరిమితం కాకుండా తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి విద్యా సామర్థ్యాలను పరిశీలించారు.గురువారం నరసింహులపేట మండలంలోని పెదనాగారం ప్రాంతంలో ప్రాథమిక పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ), అంగన్‌వాడీ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థుల వద్దకు వెళ్లి వివిధ సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడుగుతూ వారి పరిజ్ఞానాన్ని స్వయంగా పరీక్షించారు. పిల్లలతో మమేకమై వారి చదువు తీరును తెలుసుకున్నారు. విద్యార్థుల అభ్యసన స్థాయిని బట్టి బోధనా పద్ధతుల్లో మార్పులు తీసుకురావాలని ఉపాధ్యాయులకు సూచించారు.
*ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయుడి బాధ్యత!*
చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అవసరమైన అదనపు తరగతులు నిర్వహించి నేర్చుకునే స్థాయిని పెంపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో అమలవుతున్న ఎఫ్‌ఎల్‌ఎన్, లీప్ లెర్నింగ్ ఇంగ్లీష్ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధిస్తూ వారిలో చదువుపై ఆసక్తి, ఆత్మవిశ్వాసం పెంపొందించాలని సూచించారు.
*విద్యతోపాటు ఆరోగ్యంపైనా శ్రద్ధ!*
విద్యార్థుల ఎదుగుదలకు చదువుతోపాటు ఆరోగ్యం, పోషకాహారం, పరిశుభ్రత కూడా ఎంతో ముఖ్యమని కలెక్టర్ పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. హెల్త్ ఎడ్యుకేషన్, పోషకాహారం, పారిశుధ్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆర్‌బీఎస్‌కే వైద్య సిబ్బందితో పిల్లలకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు.
*సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం వద్దు!*
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందాల్సిన మధ్యాహ్న భోజనం, మెనూ, యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు తదితర సౌకర్యాలు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం అందేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని ప్రతిరోజూ ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, సబ్జెక్టుల వారీగా సిలబస్‌ను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. డిజిటల్ తరగతుల ద్వారా ఆధునిక విద్యాబోధన అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు.
*మానుకోట విద్యా ప్రమాణాలే లక్ష్యం!*
జిల్లాలోని ప్రతి పాఠశాలలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి, విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించి వారికి అవసరమైన సహకారం అందించినప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. విద్యా ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లాను రాష్ట్రంలోనే ముందంజలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ తనిఖీల్లో ఏజీసీ శ్రీరాములు, ఏఎంవో అప్పారావు, విజయలక్ష్మి, సంబంధిత మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


