నవంబర్ 15న చలో నల్లగొండ జయప్రదం చేయాలి..
కుర్చపల్లిలో భారీ ర్యాలీ
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 12 (ప్రజావాణి):
AIKS 36వ జాతీయ మహాసభల సందర్భంగా నవంబర్ 15న నల్లగొండలో జరిగే భారీ ప్రదర్శన, బహిరంగ సభకు రైతాంగం పెద్ద సంఖ్యలో తరలిరావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు, తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్ పిలుపునిచ్చారు.
తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రఘునాథపల్లి మండలం, కుర్చపల్లి గ్రామంలో ప్రధాన వీధులగుండా భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. “ఆత్మహత్యలు వద్దు – ఐక్యంగా పోరాడుదాం” అనే నినాదంతో రైతాంగం సంఘటితంగా ముందుకు సాగాలని, రైతులు, వ్యవసాయంపై కార్పొరేట్ దాడులను ప్రతిఘటించాలని కోరారు.
కనీస మద్దతు ధరల చట్టం, రుణ విమోచన చట్టం, అన్ని పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయడం, కౌలు రైతులకు రుణార్హత కార్డులు, పంట రుణాల మాఫీ, భూ భారతి చట్ట సవరణ, విద్యుత్ సవరణ బిల్లు-2025 ఉపసంహరణ, ఉపాధి హామీ కొనసాగింపు, 50 ఏళ్లు నిండిన రైతులు, వ్యవసాయ కార్మికులకు నెలకు రూ.10,000 పెన్షన్ తదితర డిమాండ్లను వారు ప్రస్తావించారు.
ఈ కార్యక్రమంలో గంగాపురం మహేందర్, కాసాని పుల్లయ్య, పులిగిల్ల రాజు, పులిగిల్ల నరేష్, తోటకూరి అనిల్, మంచాల తిరుమల, తోకల ఉప్పలయ్య, నల్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.


