ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు మెరుగుపర్చాలి
ప్రైవేట్ ఆసుపత్రులపై నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి నాయకుల వినతి
ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, నవంబర్ 12:
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్య సంస్థల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు, ప్రైవేట్ ఆసుపత్రులపై నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని తెలంగాణ లీగల్ స్టూడెంట్స్ అసోసియేషన్ టి ఏల్ ఎస్ ఏ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం టి ఏల్ ఎస్ ఏ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ సుధాకర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమానికి టి ఏల్ ఎస్ ఏ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చాట్లపల్లి తిరుపతి అధ్యక్షత వహించగా, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఇజ్జగిరి సాకేత్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నాగేలి రాకేష్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టి ఏల్ ఎస్ ఏ నాయకులు మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన మౌలిక సదుపాయాలు, తగినంత వైద్య సిబ్బంది, అత్యవసర వైద్య సేవలకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగేలా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఆసుపత్రుల్లో అవసరమైన వైద్య పరికరాలు, మందులు, బెడ్లు, ఇతర అత్యవసర సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా జిల్లాలోని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు నిబంధనలను పట్టించుకోకుండా అధిక ఫీజులు వసూలు చేస్తూ సామాన్య ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నాయని విమర్శించారు. వైద్యం పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేసే ఆసుపత్రులపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్–2002 ప్రకారం జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు, డయాగ్నస్టిక్ సెంటర్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని కోరారు. ఆయా సంస్థల రిజిస్ట్రేషన్లు, వైద్యుల విద్యార్హతలు, ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలు, రోగులకు అందించే బిల్లుల్లో పారదర్శకత, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించాలని సూచించారు.
నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఆసుపత్రులను గుర్తించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ బాధ్యత అని, ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడంతో పాటు ప్రైవేట్ వైద్య రంగంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని వారు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో టి ఏల్ ఎస్ ఏ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు సంపత్ కుమార్, జిల్లా జనరల్ సెక్రటరీ నవీన్ కుమార్, అధికార ప్రతినిధి కుమార్ తదితరులు పాల్గొన్నారు.


