వరికోల్లో విద్యుత్ సమస్య పరిష్కారానికి మరో ముందడుగు
రెడ్డి కమ్యూనిటీ హాల్ సమీపంలో నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు – సర్పంచ్ దొగ్గెల కుమారస్వామి
వరికోల్, నవంబర్ 10:
వరికోల్ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ ఓవర్లోడ్ సమస్య పరిష్కారానికి గ్రామ సర్పంచ్ దొగ్గెల కుమారస్వామి మరో ముందడుగు వేశారు. గ్రామంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ ఓవర్లోడ్ కారణంగా తరచూ వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఏర్పడటంతో ఫ్యాన్లు, టీవీలు, కూలర్లు తదితర గృహ విద్యుత్ పరికరాలు దెబ్బతింటూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను స్థానిక ప్రజలు సర్పంచ్ దృష్టికి తీసుకురావడంతో ఆయన స్పందించి విద్యుత్ శాఖ అధికారులతో చర్చించారు.
ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రెడ్డి కమ్యూనిటీ హాల్ సమీపంలో నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయించేందుకు కృషి చేశారు. ఈ క్రమంలో నవంబర్ 10వ తేదీన సర్పంచ్ దొగ్గెల కుమారస్వామి ఆధ్వర్యంలో నూతన ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా మెరుగుపడి, ఓవర్లోడ్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ దొగ్గెల కుమారస్వామి మాట్లాడుతూ గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మురాల భుజంగరావు, పింగిలి సురేందర్ రెడ్డి, పోచంపల్లి శివారెడ్డి, బొల్లం వీరారెడ్డి, అల్లెం ప్రతాప్ రెడ్డి, ఇలేందర్ రావు, గ్రామ పంచాయతీ సిబ్బంది, విలేజ్ హెల్పర్ వెంకటేశ్వర్లు, పెంతల సంపత్ తదితరులు పాల్గొన్నారు.

