*ఫిర్యాదుతో కదిలిన మున్సిపల్ అధికారులు*
*మదీనా సూపర్ మార్కెట్లో తనిఖీలు.. చెడిపోయిన ఆహార పదార్థాలు సీజ్.. యజమానికి హెచ్చరికలు.. మయూరి ఏజెన్సీ గోదాంపైనా తనిఖీలకు సిద్ధం*
నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో, భైంసా, నవంబర్ 10:–
భైంసా పట్టణంలోని మదీనా కాలనీలో క్రెసెంట్ స్కూల్ సమీపంలో ఉన్న మదీనా సూపర్ మార్కెట్లో నాణ్యతలేని, చెడిపోయిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారంటూ స్థానికుల నుంచి మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు అందడంతో అధికారులు స్పందించారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే ఆహార పదార్థాల విక్రయాలపై వచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న భైంసా మున్సిపాలిటీ అధికారులు సూపర్ మార్కెట్లో తనిఖీలు నిర్వహించి చెడిపోయిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మున్సిపాలిటీ తరఫున ఎన్రోల్మెంట్ అధికారి జాదవ్ మన్మోహన్ పటేల్, శానిటరీ జవాన్ గంగాచారి మదీనా సూపర్ మార్కెట్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెడిపోయిన ఆహార పదార్థాలను గుర్తించి సీజ్ చేశారు. ఇకపై కాలం చెల్లిన, నాణ్యతలేని, చెడిపోయిన ఆహార పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు మున్సిపాలిటీ తరఫున జరిమానా విధిస్తామని దుకాణ యజమానిని హెచ్చరించారు.
*మయూరి ఏజెన్సీ గోదాంపైనా తనిఖీలు*
ఇదే వ్యవహారానికి సంబంధించి మయూరి ఏజెన్సీ యజమానిని అధికారులు ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదని తెలిపారు. బుధవారం ఏజెన్సీ యజమానిని కలిసి, ఆయన గోదాంలోనూ తనిఖీలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆహార పదార్థాల నాణ్యత, నిల్వ విధానం, గడువు తేదీలను పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
*ఇప్పటికైనా నిరంతర తనిఖీలు చేపట్టాలి*
ఫిర్యాదు అందిన వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి తనిఖీలు నిర్వహించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక్కరోజు తనిఖీలతో సరిపెట్టకుండా భైంసా పట్టణంలోని అన్ని సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాలు, హోల్‌సేల్ గోదాంలలో నిరంతర తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా రంగంలోకి దిగి ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించాలని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


