📄 ePaper
Epaper 2
Tuesday, November 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణభూసార పరిరక్షణతోనే భవిష్యత్ భద్రత రైతులకు భూసార పరీక్షలు, పంటల వైవిధ్యంపై అవగాహన

భూసార పరిరక్షణతోనే భవిష్యత్ భద్రత రైతులకు భూసార పరీక్షలు, పంటల వైవిధ్యంపై అవగాహన

📰 Generate e-Paper Clip

భూసార పరిరక్షణతోనే భవిష్యత్ భద్రత రైతులకు భూసార పరీక్షలు, పంటల వైవిధ్యంపై అవగాహన

ప్రజా వాణి రిపోర్టర్ నర్సింహులపేట నవంబర్ 10 :
భూసార పరిరక్షణతోనే వ్యవసాయ భవిష్యత్ భద్రత సాధ్యమని వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. నర్సింహులపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు నేల ఆరోగ్యం, భూసార పరిరక్షణ, సమతుల్య ఎరువుల వినియోగం, పంటల వైవిధ్యం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి. వినయ్ కుమార్ మాట్లాడుతూ.. నేల ఆరోగ్యమే వ్యవసాయానికి పునాది అని, భూసారాన్ని కాపాడుకోవడం ద్వారా పంట దిగుబడులను పెంచుకోవడంతో పాటు సాగు ఖర్చులను తగ్గించుకోవచ్చని తెలిపారు. ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకొని, వాటి ఫలితాల ఆధారంగా పంటలకు అవసరమైన పోషకాలను సమతుల్యంగా అందించాలని సూచించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ, పచ్చిరొట్ట, జీవ ఎరువులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. పంట మార్పిడి, పప్పుధాన్యాల సాగు, అంతర పంటల విధానాలతో నేల సారాన్ని మెరుగుపరచుకోవచ్చని వివరించారు.
వ్యవసాయ అధికారి (సాంకేతిక) ఎ. శ్రీదేవి ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పిస్తూ జీవామృతం, ఘనజీవామృతం, వేస్ట్ డీకంపోజర్ తయారీ విధానాలను వివరించారు. వీటి వినియోగంతో నేలలో సూక్ష్మజీవుల వృద్ధి పెరిగి భూసార పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని రైతులు వరి సాగును తగ్గించి పెసర, మినుము, సజ్జ, జొన్న వంటి ఆరుతడి పంటలతో పాటు కూరగాయల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంచుకోవడం ద్వారా సాగునీటిని ఆదా చేసుకోవడంతో పాటు పంట నష్టాలను తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు.పశువైద్యాధికారి డాక్టర్ భూక్య మంజీలాల్ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో పశుగ్రాసం కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు వరి గడ్డిని తగలబెట్టకుండా పశుగ్రాసంగా వినియోగించుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న వరి గడ్డిని జాగ్రత్తగా నిల్వ చేసుకొని వచ్చే ఏడాది వరకు పశువులకు మేతగా ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి (సాంకేతిక) ఎ. శ్రీదేవి, పశువైద్యాధికారి డాక్టర్ భూక్య మంజీలాల్, ఏపీఎం (IKP) భూక్య రాములు, నీటిపారుదల శాఖ సహాయ ఇంజనీర్ పి. వంశీ, వ్యవసాయ విస్తరణ అధికారులు డి. మౌనిక, టి. శరత్ చంద్ర, రైతులు శ్రీను, నంబయ్య, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.