*బెల్ట్ షాప్ నిర్వాహకురాలు అరెస్ట్.. భారీగా మద్యం సీజ్*
*కిరాణా షాప్ చాటున అక్రమ మద్యం విక్రయం*
* *మన ప్రజావాణి* *మందమర్రి:-*
పట్టణంలోని మార్కెట్ ఏరియాలో కిరాణా షాపు ముసుగులో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మహిళను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నామని పట్టణ ఎస్సై గోపతి నరేష్ తెలిపారు. ఈసందర్భంగా ఎస్ఐ గోపతి నరేష్ మాట్లాడుతూ, పోలీసులకు అందిన పక్కా సమాచారంతో మార్కెట్ ఏరియాలోని కిరాణా షాపుపై దాడి చేయగా, ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని గుర్తించామని, పంచుల సమక్షంలో తనిఖీ చేసి, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితురాలు పట్టణానికి చెందిన కొనగంటి రమ అలియాస్ రాములమ్మ (61) గా గుర్తించామన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతో మద్యం షాపుల నుండి వైన్స్, బీర్లు కొనుగోలు చేసి, తన కిరాణా షాపులో నిల్వ ఉంచి, ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో నిందితురాలు అంగీకరించిందని తెలిపారు. ఈ తనిఖీలో మొత్తం 38,860 రూపాయల విలువ గల 74.450 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని, మద్యం బాటిళ్లను సీజ్ చేసి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చట్టవిరుద్ధంగా మద్యం బెల్ట్ షాపులు నడిపినా, అక్రమంగా మద్యం నిల్వ ఉంచినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..

