*ఇంటర్మీడియట్ ఫలితాలపై అధ్యాపకులు ప్రత్యేక దృష్టి సారించాలి*
*రాయికల్, నవంబర్ 09(ప్రజావాణి):*
ఇంటర్మీడియట్ ఫలితాలపై అధ్యాపకులు ప్రత్యేక దృష్టి సారించాలని జగిత్యాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వై. రమేష్ బాబు పేర్కొన్నారు. సోమవారం రాయికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు.కళాశాలకు చేరుకున్న ఆయన ముందుగా తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థుల వద్దకు వెళ్లి వారితో నేరుగా మాట్లాడారు. పాఠ్యాంశాలపై అవగాహన, చదువులో ఎదురవుతున్న ఇబ్బందులు, హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధ్యాపకుల బోధనా తీరును కూడా సమీక్షించారు.అనంతరం ప్రిన్సిపాల్, అధ్యాపకులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక సూచనలు చేశారు. ముఖ గుర్తింపు ద్వారా హాజరు నమోదును ప్రతిరోజూ తప్పనిసరిగా పూర్తి చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని స్పష్టం చేశారు. రాబోయే ఇంటర్మీడియట్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక పునశ్చరణ తరగతులు నిర్వహించాలని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు తల్లిదండ్రులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని, అధ్యాపకులంతా సమష్టిగా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.నిర్మల, కళాశాల మండలి సభ్యుడు జె. రాజేష్, అధ్యాపక బృందం పాల్గొన్నారు.

