బియ్యం దందా.. సామాన్యుడిపై ధరల వడ్డింపు!
• వెంకటాపురం కిరాణా షాపుల్లో ఇష్టారాజ్యం
• అక్రమ విక్రయాలపై దాడులు చేయాలని ప్రజాసంఘాల డిమాండ్
• బిల్లులు ఇవ్వకుండా, అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు: డీఎస్ఓ
వెంకటాపురం (నూగురు), నవంబర్ 8 (ప్రజావాణి): ఏజెన్సీ మండల కేంద్రమైన వెంకటాపురంలో నిత్యావసర వస్తువులను కృత్రిమ కొరత సృష్టించి, బ్లాక్ మార్కెట్ చేస్తూ అధిక ధరలకు అమ్మడంపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. అధిక లాభార్జనే ధ్యేయంగా సాగుతున్న కొందరు వ్యాపారుల దందా వల్ల సామాన్య ప్రజలు కిరాణా షాపుల్లో అడుగు పెట్టాలంటేనే భయపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దేశిత ధరలకే సరుకులు విక్రయించాల్సి ఉండగా, వ్యాపారులు మాత్రం అందినకాడికి దండుకుంటూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కఠిన చర్యలు తీసుకుంటాం:
ఈ అక్రమ విక్రయాల నేపథ్యంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి షా ఫైజల్ హుస్సేని ఒక ప్రకటనలో వ్యాపారులను హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ఠ ధరల (బీపీటీ కిలోకు రూ. 66, ఆర్ఎన్ఆర్ రూ. 74, హెచ్ఎంటీ రూ. 79) కంటే ఒక్క రూపాయి ఎక్కువ వసూలు చేసినా చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. వ్యాపారులు వినియోగదారులకు కచ్చితంగా బిల్లులు ఇవ్వాలని, ధరల పట్టికను బోర్డులపై ప్రదర్శించాలని ఆదేశించారు. బియ్యం కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు ధర, తూకం, నాణ్యతను పరిశీలించి బిల్లు తీసుకోవాలని, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వెంటనే పౌర సరఫరాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. కాగా, నిబంధనలను ఉల్లంఘిస్తున్న షాపుల యజమానులపై రెవెన్యూ, సివిల్ సప్లైస్ అధికారులు తక్షణమే ఆకస్మిక దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

