ఉద్యమ నాయకుడి కుటుంబానికి అండగా నిలిచిన జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్
వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి రూ.లక్ష తక్షణ ఆర్థిక సాయం
పిల్లల విద్యకు భరోసా..
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్ , నవంబర్ 04 (ప్రజావాణి): తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన నాయకుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ అండగా నిలిచారు.
బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన వేముల లక్ష్మణ్ గౌడ్ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసి చైర్ పర్సన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని స్వయంగా అందించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి ఇది తక్షణ ఉపశమనం కలిగిస్తుందని ఆమె తెలిపారు.
అంతేకాకుండా, మృతుడి భార్యకు ఉపాధి కల్పించేందుకు పార్టీ అధిష్టానంతో మాట్లాడి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పిల్లల ఉన్నత చదువులకు అవసరమైన సహాయ సహకారాలు అందించి, వారి భవిష్యత్తుకు పూర్తి భరోసా ఇస్తామని చైర్ పర్సన్ స్పష్టం చేశారు.
“తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన నాయకుడి కుటుంబం కష్టకాలంలో ఒంటరిగా లేదు. మేమంతా అండగా ఉంటాం. కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం” అని చైర్ పర్సన్ బాలమణి శ్రీనివాస్ ఈ సందర్భంగా తెలిపారు.
కుటుంబానికి ఆర్థిక సాయం అందించడంతో పాటు, పిల్లల విద్యకు భరోసా కల్పించినందుకు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. చైర్ పర్సన్ గారి మానవతా స్పందన పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

