📄 ePaper
Epaper 2
Thursday, November 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి - లక్ష్మణ్ గౌడ్ మృతిపై ప్రభుత్వం స్పందించాలి..

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి – లక్ష్మణ్ గౌడ్ మృతిపై ప్రభుత్వం స్పందించాలి..

📰 Generate e-Paper Clip

 

ముందస్తు అరెస్టులను ఖండించిన మ్యాకల శ్రీకాంత్ యాదవ్

బెజ్జంకి, నవంబర్ 5 (ప్రజావాణి)

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ జీవితాలను, కుటుంబాలను పణంగా పెట్టి ఎన్నో ఏళ్ల పాటు పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (టీయూఎఫ్) బెజ్జంకి మండల అధ్యక్షులు మ్యాకల శ్రీకాంత్ యాదవ్ డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నేటికీ పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ ఆత్మహత్య చేసుకుని మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు. ఈ ఘటన ఉద్యమకారుల ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోందని పేర్కొన్నారు.
తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు రావడం విచారకరమన్నారు. లక్ష్మణ్ గౌడ్ మృతిపై ప్రభుత్వం వెంటనే స్పందించి, ఆయన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.అర్హులైన తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు అందించి, నెలవారీ గౌరవ పెన్షన్ కల్పించాలని కోరారు. ఉద్యమకారుల కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. ఉద్యమకారులపై నమోదైన కేసులను నిబంధనల ప్రకారం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

*ముందస్తు అరెస్టులను ఖండిస్తున్నాం*

తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లక్ష్మణ్ గౌడ్ మృతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడాన్ని మ్యాకల శ్రీకాంత్ యాదవ్ తీవ్రంగా ఖండించారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు ఉద్యమాలు చేసి, అరెస్టులు ఎదుర్కొని ఎన్నో కష్టనష్టాలను భరించిన ఉద్యమకారులను నేడు తమ న్యాయమైన హక్కుల కోసం ప్రశ్నించినందుకు అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అరెస్టులతో ఉద్యమకారుల గొంతును నొక్కలేరని, వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం గుర్తించి పరిష్కరించాలని కోరారు.తెలంగాణ రాష్ట్రం ఉద్యమకారుల త్యాగాల పునాదులపై ఏర్పడిందని, వారి త్యాగాలను గుర్తించి గౌరవించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని స్పష్టం చేశారు. లక్ష్మణ్ గౌడ్ మృతి వంటి విషాదకర ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యమకారులకు న్యాయం చేయాలని, అరెస్టు చేసిన ఉద్యమకారుల ఫోరం నాయకులను వెంటనే విడుదల చేయాలని మ్యాకల శ్రీకాంత్ యాదవ్ డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.