భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ముదిగొండ సీఐ మురళి సూచనలు
ముదిగొండ నవంబర్ 3 ప్రజావాణి
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్,ఎల్లో అలర్ట్లు జారీ చేసిన నేపథ్యంలో ముదిగొండ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముదిగొండ ఎస్హెచ్ఓ, సీఐ మురళి సూచించారు.భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని కోరారు.ముఖ్యంగా వర్షాల సమయంలో వాగులు, వంకలు, చెరువులు, కాలువలు పొంగిపొర్లే ప్రాంతాలకు వెళ్లకూడదని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, నీరు నిలిచిన రహదారులపై ప్రయాణాలు చేయవద్దని తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు.విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని, చెట్ల కింద నిలబడకూడదని సూచించారు. వర్షాల సమయంలో పిల్లలు, వృద్ధుల విషయంలో కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.ప్రజలు వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ మురళి కోరారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

