*ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే బియ్యం విక్రయించాలి*
సూర్యాపేట/ ప్రజావాణి జిల్లా బ్యూరో, నవంబర్ 2:
అధిక ధరలకు విక్రయిస్తే చట్టప్రకారం చర్యలు: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
జిల్లాలో బియ్యం విక్రయాలు ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారమే జరగాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మించి బియ్యం విక్రయించే వ్యాపారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ స్పష్టం చేశారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సూర్యాపేట, హుజూర్నగర్, కోదాడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మరియు సూర్యాపేట జిల్లా హోల్సేల్ రైస్ డీలర్లతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో బియ్యం ధరలను నియంత్రిస్తూ వినియోగదారులకు సరసమైన ధరలకు బియ్యం అందుబాటులో ఉండేలా రైస్ మిల్లర్లు, హోల్సేల్ డీలర్లు సహకరించాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధిక ధరలకు బియ్యం విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యాపారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అదేవిధంగా, ప్రభుత్వం నిర్దేశించిన బియ్యం ధరల పట్టికను అన్ని బియ్యం విక్రయ కేంద్రాలలో ప్రజలకు స్పష్టంగా కనిపించే విధంగా ప్రదర్శించాలని ఆదేశించారు. ధరల విషయంలో పారదర్శకత పాటిస్తూ, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు వ్యాపారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు.
ఈ సమావేశంలో పాల్గొన్న రైస్ మిల్లర్లు, హోల్సేల్ రైస్ డీలర్లు ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారమే బియ్యం విక్రయిస్తామని, ప్రభుత్వం నిర్దేశించిన ధరల పట్టికను తమ దుకాణాలలో తప్పనిసరిగా ప్రదర్శిస్తామని జిల్లా కలెక్టర్కు హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ బి. హరి సింగ్, డీఎస్ఓ మోహన్ బాబు, జిల్లా మేనేజర్, సివిల్ సప్లైస్ శ్రీధర్ రెడ్డి, సిబ్బంది, జిల్లాలోని రైస్ మిల్లర్లు, హోల్సేల్ రైస్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

