తెల్లాపూర్‌లో అక్రమ నీటి దందాకు చెక్.. అనుమతుల్లేని బోర్లు తొలగింపు!
హైడ్రా, రెవెన్యూ అధికారుల సంయుక్త దాడులు
తేనా పిర్యాదుతో కదిలిన యంత్రాంగం
రామచంద్రపురం, నవంబర్ 2 (ప్రజావాణి):తెల్లాపూర్ శివారు ప్రాంతాల్లో భూగర్భ జలాలను అక్రమంగా వెలికితీస్తూ ట్యాంకర్ల ద్వారా నీటి వ్యాపారం చేస్తున్న వారిపై అధికారులు చర్యలు చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన బోర్లను తొలగిస్తూ అక్రమ నీటి వ్యాపారానికి అడ్డుకట్ట వేశారు. హైడ్రా ఇన్స్పెక్టర్ మల్లేష్ ఆధ్వర్యంలోని బృందం, రామచంద్రాపురం రెవెన్యూ అధికారులు ఆర్ఐ రంజిత్, వీఆర్వోలు శంకర్, నరసింహతో పాటు కొల్లూరు పోలీస్ స్టేషన్ ఎస్సై మురళి, పోలీసు సిబ్బంది సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహించారు.
తెల్లాపూర్ పరిధిలో అనుమతులు లేకుండా భూగర్భ జలాలను తోడుతూ అక్రమంగా నీటి వ్యాపారం చేస్తున్నారంటూ తెల్లాపూర్ నైబర్‌హుడ్ అసోసియేషన్ (తేనా) అధికారులకు ఫిర్యాదు చేసింది. దీనికి తోడు స్థానిక నివాసితులు రెండు రోజులుగా అర్ధరాత్రి వరకు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేయడంతో అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో చర్యలకు దిగారు. ఈ క్రమంలో అక్రమంగా ఏర్పాటు చేసిన బోర్లను తొలగించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టారు.
అక్రమ నీటి వ్యాపారానికి అడ్డుకట్ట వేసేందుకు సమన్వయంతో పనిచేసిన హైడ్రా, రెవెన్యూ అధికారులకు, సహకరించిన కొల్లూరు పోలీస్ స్టేషన్ ఎస్సై మురళి, పోలీసు సిబ్బందికి తేనా ప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కేవలం కొన్ని ప్రాంతాల్లోనే కాకుండా తెల్లాపూర్ పరిధిలోని అన్ని అక్రమ బోర్వెల్ కేంద్రాలను గుర్తించి పూర్తిస్థాయిలో తొలగించాలని కోరారు.
వేలాది కుటుంబాలు నివసిస్తున్న తెల్లాపూర్‌లో భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేస్తే భవిష్యత్తులో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలగించిన బోర్ల వద్ద నిరంతర పర్యవేక్షణ చేపట్టి తిరిగి అక్రమ నీటి వ్యాపారం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. భూగర్భ జలాల పరిరక్షణ కోసం అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజల పక్షాన తమ పోరాటం కొనసాగిస్తామని తేనా ప్రతినిధులు స్పష్టం చేశారు.

