జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి అక్టోబర్ 31 (ప్రజావాణి):
మండలంలోని కొత్తపేట గ్రామంలో భారతీయ పత్తి సంస్థ (సీసీఐ) ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ…. రైతులు తాము పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర పొందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులు ఎవరూ దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియ అంతటా పారదర్శకత పాటిస్తూ, అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను కోరారు. రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, రైతులకు ఎల్లవేళలా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, ప్రజాప్రతినిధుల, గ్రామ ప్రజలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

