దేవరుప్పులలో తారు, సీసీ రోడ్ల పనులను ప్రారంభించిన సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 31(ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల మండల కేంద్రమైన దేవరుప్పుల గ్రామ అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఆధ్వర్యంలో, మండల కేంద్రంలో ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న రోడ్డు పనులకు మోక్షం లభించిందని,
కొత్తవాడ నుండి గుడి చెరువు వరకు తారు రోడ్డు, అక్కడి నుండి బోడబండ తండా వరకు సీసీ రోడ్ల నిర్మాణ పనులను దేవరుప్పుల గ్రామ సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ శనివారం ఘనంగా పునః ప్రారంభించారు.
గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ఈ రోడ్డు పనులకు సర్పంచ్ కొబ్బరికాయ కొట్టి, పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులను మొదలుపెట్టారు. కొత్తవాడ, గుడి చెరువు, బోడబండ తండా ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఈ రోడ్డు కోసం ఎదురుచూస్తున్నారు. వర్షాకాలం వస్తే బురదమయంగా మారి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సర్పంచ్ కృష్ణమూర్తి గౌడ్ మాట్లాడుతూ…
“తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి, ముఖ్యంగా అంతర్గత రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి సహకారంతో నిలిచిపోయిన పనులన్నీ ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నాం. గ్రామస్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నాణ్యతతో కూడిన రోడ్డును త్వరితగతిన పూర్తి చేయడమే మా లక్ష్యం. వర్షాకాలంలో ప్రజలకు బురద రోడ్ల నుండి విముక్తి కల్పించేందుకు ఈ పనులు ఎంతో దోహదపడతాయి. రోడ్డు నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని కాంట్రాక్టర్‌కు స్పష్టంగా చెప్పాం” అని అన్నారు.
గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు చిలుకూరి నర్సయ్య, గోడిశాల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, యువజన నాయకులు, గ్రామస్తులు, తండా వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

