పీరంపల్లిలో కలెక్టర్ దీపక్ తివారీ ఆకస్మిక తనిఖీలు: పనుల నాణ్యత, సంక్షేమ పథకాల అమలుపై ఆరా..
పరిగి/కుల్కచర్ల,అక్టోబర్ 30(ప్రజావాణి )
మండల పరిధిలోని పీరంపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ సుడిగాలి పర్యటన చేపట్టారు. గ్రామంలోని పలు అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తీరును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ పర్యటనలో భాగంగా గ్రామంలో కొనసాగుతున్న పంట పొలాల స్థితిగతులను, భూ సర్వే ప్రక్రియను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి పంటల పరిస్థితి, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూ సర్వేను పారదర్శకంగా, ఎటువంటి లోటుపాట్లు లేకుండా సకాలంలో పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాలని సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. వంటశాల, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజన నాణ్యతపై ఆరా తీశారు. మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని నాణ్యతా ప్రమాణాలతో అందించాలని, పరిశుభ్రత విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని నిర్వాహకులకు స్పష్టం చేశారు.
అలాగే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పని ప్రదేశంలో కూలీల హాజరు పట్టికను, జరుగుతున్న పనుల నాణ్యతను తనిఖీ చేశారు. కూలీలతో మాట్లాడి రోజువారీ వేతనం, తాగునీరు, నీడ వంటి మౌలిక వసతుల కల్పనపై విచారించారు. అర్హులైన ప్రతి కూలీకీ పని కల్పించడంతో పాటు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనులను పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఆకస్మిక తనిఖీ కార్యక్రమంలో సంబంధిత మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామ సిబ్బంది పాల్గొన్నారు.


