*పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందిన ముగ్గురు పోలీస్ అధికారులు – వారి సేవలను అభినందించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్..*
*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
శుక్రవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన చింతల రమేష్ (ఎస్ఐ, మిర్యాలగూడ II టౌన్ పోలీస్ స్టేషన్), శంకర్ రాజు (ఏఎస్ఐ, నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్), వై. రామలింగయ్య (హెడ్ కానిస్టేబుల్, కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్)లను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో పనిచేయడం అనేది కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం అంకితభావంతో పనిచేయాల్సిన బాధ్యత అని అన్నారు. సుదీర్ఘకాలం పాటు వివిధ ప్రాంతాల్లో, వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తూ ప్రజలకు పోలీస్ సేవలు అందించిన వారి కృషి అభినందనీయమని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఎదురయ్యే ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ క్రమశిక్షణ, అంకితభావం, బాధ్యతాయుతమైన సేవలతో పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకువచ్చారని కొనియాడారు. పదవీ విరమణ అనేది ఉద్యోగ జీవితానికి ముగింపు మాత్రమేనని, జీవితంలో మరో కొత్త అధ్యాయానికి ప్రారంభమని ఎస్పీ అన్నారు. ఇకపై కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆరోగ్యంగా, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. పదవీ విరమణ అనంతరం కూడా పోలీస్ శాఖతో ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తూ, తమ అనుభవాలను అవసరమైన సందర్భాల్లో ఇతరులకు పంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఓ శివ ప్రసాద్, ఆర్. ఐ సంతోష్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు సైదులు, ఉపాధ్యక్షులు సీఐ కరుణాకర్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని పదవీ విరమణ పొందిన అధికారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

