జనగామను కరువు మండలంగా ప్రకటించాలి – యాసారపు కరుణాకర్
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 29(ప్రజావాణి): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కరువు మండలాల జాబితాలో జనగామ మండలం లేకపోవడం దురదృష్టకరమని, దీనివల్ల ఇక్కడి ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోతారని మాదిగ మేధావుల ఫోరం జనగామ జిల్లా కోఆర్డినేటర్ యాసారపు కరుణాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.
గురువారం జనగామలో విలేకరులతో మాట్లాడిన ఆయన, ఎల్ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాలు లేక జనగామ మండలంలో ఒక్క చెరువు కూడా నిండలేదని అన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటలు నీరు లేక పూర్తిగా ఎండిపోయి బీళ్లుగా మారాయని తెలిపారు. భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోవడంతో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కరువు మండలంగా ప్రకటించకపోవడం వల్ల జనగామ మండల రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే కరువు సహాయక చర్యలు, ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా, ఉపాధి హామీ పనుల పెంపు, రుణాల రీషెడ్యూల్ వంటి ప్రోత్సాహకాలను కోల్పోతారని ఆయన అన్నారు. ఇది రైతులకు తీవ్ర అన్యాయమని అన్నారు.
జనగామ మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రకటించకపోతే దశలవారీగా అన్ని గ్రామాల రైతులు, ప్రజలు, ప్రజాసంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఇందులో భాగంగా ఈ ఆదివారం జనగామలో రైతు సంఘం నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే వారంలో మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న చెరువులను సందర్శించి వాస్తవ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.


