సొసైటీ భూములపై కబ్జా కన్ను.. కదిలిన కలెక్టర్!
ప్రజావాణిలో పలుమార్లు ఫిర్యాదులతో స్పందించిన కలెక్టర్ ప్రతీక్ జైన్
ప్రైవేట్ వ్యక్తుల కబ్జా ప్రయత్నాలను అడ్డుకోవాలి.. భూముల సరిహద్దులు నిర్ణయించాలని బాధితుల ఆవేదన
అమీన్‌పూర్, అక్టోబర్ 29 (ప్రజావాణి): అమీన్‌పూర్‌లో సొసైటీ భూములను కొందరు ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు పలుమార్లు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు చేయడంతో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పందించారు. బీరంగూడ మల్లికార్జున నగర్‌లోని ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే నంబర్లు 969, 970, 989 నుంచి 1014, 1016, 1018 నుంచి 1020, 1029, 1030, 1033, 1034, 1036 నుంచి 1064, 1110 నుంచి 1118 పరిధిలోని భూముల హద్దులను నిర్ధారించాలని బాధితులు కోరుతున్నారు. సుమారు 90 నుంచి 92 ఎకరాల పట్టా భూములు ఉన్నాయని, వాటిపై కొందరు ప్రైవేట్ వ్యక్తులు కన్నేసి కబ్జాకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వారి బారిన పడకుండా సమగ్ర సర్వే నిర్వహించి, సరిహద్దులు నిర్ణయించి తమ భూములకు రక్షణ కల్పించాలని కలెక్టర్‌ను వేడుకున్నారు. ఏళ్ల తరబడి ఫిర్యాదులు చేస్తున్నా క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు. ప్రతి సమస్యకూ కలెక్టరే స్వయంగా రావాలా? స్థానిక అధికారుల బాధ్యత ఏమైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2014 హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని భూముల వివాదాన్ని పరిష్కరించాలని, కబ్జా ప్రయత్నాలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ పర్యటనతోనైనా తమ భూములకు రక్షణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

