📄 ePaper
Epaper 2
Monday, October 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఏదుల నుంచి డిండికి నీటి తరలింపు నిర్ణయాన్ని రద్దు చేయాలి

ఏదుల నుంచి డిండికి నీటి తరలింపు నిర్ణయాన్ని రద్దు చేయాలి

📰 Generate e-Paper Clip

ఏదుల నుంచి డిండికి నీటి తరలింపు నిర్ణయాన్ని రద్దు చేయాలి: ముకుంద నాగేశ్వర్ డిమాండ్

పరిగి:ప్రజావాణి,అక్టోబర్ 26:

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఏదుల రిజర్వాయర్ నుండి నల్గొండ జిల్లాలోని డిండికి నీటిని తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయం లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును శాశ్వతంగా సమాధి చేయడమేనని తెలంగాణ ఉద్యమ నాయకులు, బీజేపీ నేత, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జలసాధన సమితి కన్వీనర్ ముకుంద నాగేశ్వర్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ నిర్ణయం కేవలం ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్ల కమిషన్ల కోసమేనని, ప్రజా ప్రయోజనాల కోసం కాదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
సోమవారం ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు:
* ఉమ్మడి రంగారెడ్డికి తీవ్ర అన్యాయం: ఏదుల నుండి డిండికి నీళ్లు మళ్లిస్తే లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సాగులోకి రావాల్సిన సుమారు 3 లక్షల ఎకరాల ఆయకట్టు ఎండిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
* ముఖ్యమంత్రి నిర్లక్ష్యం తగదు: సీఎం రేవంత్ రెడ్డి స్వస్థలమైన మహబూబ్‌నగర్, ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన కొడంగల్ (వికారాబాద్ జిల్లా), ఎంపీగా గెలిపించిన మల్కాజ్‌గిరి (ఉమ్మడి రంగారెడ్డి జిల్లా) ప్రాంతాలకు ఈ నిర్ణయం వల్ల తీరని అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి మౌనం వహించడం దురదృష్టకరమన్నారు.
* నాయకుల అసమర్థత: ఇప్పటికే 12 నుండి 15 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్న నల్గొండకు అదనంగా నీటిని తరలిస్తుంటే, కృష్ణా-గోదావరి నదుల నుంచి చుక్క నీరు రాని రంగారెడ్డి జిల్లా ఎడారిగా మారుతోందని, దీనికి స్థానిక ప్రజాప్రతినిధుల అవగాహన రాహిత్యం, అసమర్థతే కారణమని ధ్వజమెత్తారు.
* కాంగ్రెస్ హామీల విస్మరణ: ఎన్నికల సమయంలో పాదయాత్ర చేసి లక్ష్మీదేవిపల్లిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇప్పుడు ఏదుల నుండి డిండికి నీటి తరలింపు పనులకు అనుమతులు ఇవ్వడం ఈ ప్రాంత ప్రజల హక్కులను కాలరాయడమేనని విమర్శించారు.
తెలంగాణలోనే అత్యంత ఎత్తైన ప్రాంతమైన లక్ష్మీదేవిపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మించి, కృష్ణా–గోదావరి నదులను అనుసంధానించకపోతే భవిష్యత్తులో ఉమ్మడి రంగారెడ్డితో పాటు హైదరాబాద్ నగరం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొని ఎడారిగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డిండికి నీటి మళ్లింపును నిలిపివేసి, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. అలాగే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రైతులు, యువత, ప్రజాప్రతినిధులు తమ నీటి హక్కుల సాధన కోసం కలిసికట్టుగా ఉద్యమించాలని ముకుంద నాగేశ్వర్ పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.