📄 ePaper
Epaper 2
Monday, October 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపేదల ఇళ్ల కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం

పేదల ఇళ్ల కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం

📰 Generate e-Paper Clip

పేదల ఇళ్ల కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత పంపిణీ చేసిన మంత్రి

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

పేదల స్వంత ఇంటి కల నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం నేలకొండపల్లి రైతు వేదికలో నేలకొండపల్లి మండల లబ్ధిదారులకు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను మంత్రి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కల సాకారం చేస్తున్నదని అన్నారు. గతంలో పేదలు ఏ ప్రభుత్వ హయాంలోనైనా ఇల్లు కట్టుకోగలమా అని సందేహించేవారని, కానీ నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదల కలలు నిజమవుతున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి పేదవాడికి కులం, మతం, పార్టీ చూడకుండా ఇందిరమ్మ ఇళ్లు అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 4.5 లక్షల ఇళ్లు ఇవ్వగా, రెండో విడతలో 2.5 లక్షల ఇళ్లు ఇస్తున్నామని, అలాగే హైదరాబాద్‌ పట్టణానికి అదనంగా ఒక లక్ష ఇళ్లను మంజూరు చేసి, మొత్తం 8 లక్షల ఇళ్లను పేదలకు అందిస్తున్నామని అన్నారు.

నేలకొండపల్లి మండలంలో మొదటి విడత కింద మంజూరైన 648 ఇళ్లలో సుమారు 620 ఇళ్లు పూర్తయ్యాయని, వివిధ కారణాల వల్ల మిగిలిన ఇళ్లను కూడా త్వరలోనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫైనల్ బిల్లులన్నింటినీ రాబోయే 10 రోజుల్లోగా లబ్ధిదారుల ఖాతాల్లో ఎలాంటి లంచాలకు తావు లేకుండా జమ చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి తెలిపారు.

పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపకుండా, అభివృద్ధిని కూడా జోడెడ్ల వలె సమానంగా ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. రైతాంగానికి పూర్తి భద్రత కల్పిస్తూ, మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 72 వేల కోట్ల రూపాయల సున్నా వడ్డీ రుణాలు డ్వాక్రా మహిళలకు అందించామని, నిరుద్యోగ యువతకు 75 వేల ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు మరో 14,000 పైచిలుకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగిందని అన్నారు.

ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, కరెంటు, నీటి సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో రైతన్నలు నష్టపోకూడదనే ఉద్దేశంతో రెండో పంట వేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నట్లు మంత్రి అన్నారు.

అంతకుముందు మంత్రి నేలకొండపల్లి మండలం అనాసాగరం నుండి పమ్మి వరకు 2.5 కిలోమీటర్ల మేర 2.80 కోట్ల అంచనా వ్యయంతో బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు.

ఈ కార్యక్రమంలో హౌజింగ్ పిడి భూక్యా శ్రీనివాస్, పిఆర్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, మండల ఎంపీడీవో ఎర్రయ్య, తహశీల్దార్ రాంప్రసాద్, స్థానిక సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.