📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపెద్దామడూర్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

పెద్దామడూర్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

📰 Generate e-Paper Clip

పెద్దామడూర్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..

మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి..

గ్రామస్థులకు 100 డప్పులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి..

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 16(ప్రజావాణి): జిల్లా లోని
దేవరుప్పుల మండలం, పెద్దామడూర్ గ్రామంలో ఏడో రోజు బతుకమ్మ సంబరాలు శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కి పెద్దామడూర్ గ్రామ ప్రజలు, మహిళలు పెద్దఎత్తున తరలివచ్చి ఘనస్వాగతం పలికారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రామమంతా పండుగ శోభను సంతరించుకుంది. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయ పాటలు పాడుతూ, ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. మహిళలతో మమేకమై పండుగ సంబరాల్లో పాల్గొనడంతో గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
గ్రామస్థులకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి 100 డప్పులను పంపిణీ చేశారు. గ్రామీణ కళలు, జానపద సంప్రదాయాలను ప్రోత్సహించడంతో పాటు స్థానిక కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో డప్పుల పంపిణీ చేయడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. ప్రకృతిని పూల రూపంలో పూజిస్తూ, మహిళలంతా ఒక్కచోట చేరి ఆనందంగా జరుపుకునే బతుకమ్మ పండుగ మన తెలంగాణ ప్రత్యేకతను ప్రపంచానికి చాటిచెబుతుందని పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న ఇలాంటి పండుగలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

బతుకమ్మ వేడుకలు మహిళల్లో ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందించడంతో పాటు మన సంప్రదాయాల పట్ల గౌరవాన్ని మరింత పెంచుతాయని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ కుటుంబంతో పాటు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, కళలు, జానపద సంప్రదాయాలను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

గ్రామీణ ప్రాంతాల్లో డప్పు కళకు ప్రత్యేక గుర్తింపు ఉందని, డప్పు మన జానపద సంస్కృతిలో అంతర్భాగమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇలాంటి సంప్రదాయ కళలను ప్రోత్సహిస్తూ కళాకారులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.

పెద్దామడూర్ గ్రామ ప్రజలు, మహిళలు తనకు ఘనస్వాగతం పలికి ఆప్యాయతను చూపించడం పట్ల ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశీర్వాదం, సహకారంతో పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఈ వేడుకలతో పెద్దామడూర్ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, మహిళలు, గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.