*గతంలో పదవులు పొందిన వారికే మళ్లీ అవకాశాలా?*
*ఇంతకాలం పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు ఏదీ?*
*వ్యవసాయ మార్కెట్ కమిటీలు, సొసైటీ నియామకాల్లో కొత్తవారికి అవకాశం కల్పించాలి*
*జిల్లా కాంగ్రెస్ ఓబీసీ విభాగం అధ్యక్షుడు గువ్వ రవి ముదిరాజ్
విజ్ఞప్తి*
మేడ్చల్, నేటి ప్రస్థానం:- కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ ఇంతకాలం పదవుల కోసం ఎదురుచూస్తున్న నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు కల్పించాలని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి జిల్లా కాంగ్రెస్ ఓబీసీ విభాగం అధ్యక్షుడు గువ్వ రవి ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు. గతంలో పదవులు పొందిన వారికే మరోసారి అవకాశం కల్పించకుండా, ఇప్పటివరకు ఎలాంటి పదవులు దక్కని వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్ కమిటీలు, సహకార సంఘాల (సొసైటీల) నియామకాల్లో పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన కొత్తవారికి అవకాశం కల్పించాలని ఆయన ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణ ప్రాంతాలు జీహెచ్ఎంసీ పరిధిలోకి విలీనం కావడంతో స్థానిక రాజకీయ, పరిపాలనా పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయని రవి ముదిరాజ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు, రాజకీయ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ అధికారంలోకి రావడానికి రాత్రింబవళ్లు శ్రమించిన కార్యకర్తలు, నాయకులు తమ కుటుంబాలను సైతం పక్కనపెట్టి పార్టీ కోసం పనిచేశారని తెలిపారు. అయినప్పటికీ, వారిలో చాలామందికి ఇప్పటివరకు ఎలాంటి పదవులు దక్కకపోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు. కార్యకర్తగా, నాయకుడిగా, ఎంపీటీసీగా, వార్డు సభ్యుడిగా, సర్పంచ్గా, కౌన్సిలర్గా వివిధ స్థాయిల్లో పనిచేసిన వారు, రాజకీయ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు ఉన్నారని పేర్కొన్నారు.
గతంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు, సహకార సంఘాల్లో పదవులు నిర్వహించి, పదవీకాలం పూర్తయిన వారికి తిరిగి అవకాశం కల్పించే విషయంలో పార్టీ నాయకత్వం పునరాలోచించాలని ఆయన సూచించారు. ఇప్పటికే పదవులు పొందిన వారికే మళ్లీ పదవులు కేటాయిస్తే, ఇంతకాలం అవకాశం కోసం ఎదురు చూస్తున్న నాయకులు, కార్యకర్తలకు ఎప్పుడు అవకాశం లభిస్తుందని ప్రశ్నించారు.
పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభించినప్పుడే క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని రవి ముదిరాజ్ అభిప్రాయపడ్డారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, సొసైటీ కమిటీల నియామకాల్లో గతంలో పదవులు పొందని వారికి ప్రాధాన్యతనిస్తూ, అర్హత, పార్టీ సేవలను పరిగణనలోకి తీసుకుని అవకాశాలు కల్పించాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని, పదవుల పంపిణీలో సముచిత న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ ఓబీసీ విభాగం అధ్యక్షుడు గువ్వ రవి ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు.

