ఇచ్చిన మాటకు నిలువెత్తు సాక్ష్యం — కూటమి కొలువుల జాతర:- మంత్రాలయం టిడిపి ఇన్చార్జి వర్యులు.
ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 15 మంత్రాలయం కర్నూల్ జిల్లా.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే నిరుద్యోగ యువత ఆకాంక్షలకు పెద్దపీట వేస్తూ విద్యాశాఖలో చారిత్రాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని మంత్రాలయం టీడీపీ ఇంచార్జి శ్రీ ఎన్. రాఘవేంద్ర రెడ్డి తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే వరుసగా రెండు డీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేసి లక్షలాది మంది యువతీ యువకుల కొలువుల కలను సాకారం చేసిందన్నారు. కేవలం 150 రోజుల రికార్డు వ్యవధిలోనే 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి, నిరుద్యోగ కుటుంబాల్లో వెలుగులు నింపిందని పేర్కొన్నారు.
అనంతరం మరో 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రెండో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. ప్రభుత్వ, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో 2,111 పోస్టులు, దివ్యాంగ విద్యార్థుల కోసం 350 స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు, వివిధ సంక్షేమ రెసిడెన్షియల్ సంస్థల్లో 260 పోస్టులను కేటాయించడం ద్వారా అన్ని వర్గాల నిరుద్యోగులకు అవకాశాలు కల్పించామని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 1994 నుంచి 2025 వరకు మొత్తం 14 డీఎస్సీల ద్వారా 1,96,619 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం చారిత్రాత్మక రికార్డు అని శ్రీ రాఘవేంద్ర రెడ్డి గారు అన్నారు.
ఇందులో రెగ్యులర్ రిక్రూట్మెంట్ ద్వారా1,73,171, లిమిటెడ్రిక్రూట్మెంట్ ద్వారా 9,706, స్పెషల్ రిక్రూట్మెంట్ ద్వారా 7,101 పోస్టులు భర్తీ అయ్యాయని వివరించారు. ఉపాధ్యాయులకు అండగా కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులపై పని ఒత్తిడిని తగ్గించేందుకు అనవసర మొబైల్ యాప్ల భారాన్ని తొలగించామని, బదిలీలను పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు.వివిధ కేడర్లలో నిలిచిపోయిన 4,000 మందికి పైగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామని చెప్పారు.
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 729 నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయడం, 90 మంది ఎస్టీ యువతను ఉపాధ్యాయులుగా నియమించడం, 700 కోయభారతి టీచర్ పోస్టులను భర్తీ చేయడం వంటి చర్యలు చేపట్టామని వివరించారు. అలాగే 476 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 3,619 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవలను పునరుద్ధరించామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఉపాధ్యాయులపై పెట్టిన కేసులను ఎత్తివేయడం, పెండింగ్లో ఉన్న జీతాలను విడుదల చేయడం, ఉపాధ్యాయులతో మరుగుదొడ్ల ఫోటోలు తీయించే ఆదేశాలను రద్దు చేయడం వంటి చర్యలతో కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులకు గౌరవాన్ని పునరుద్ధరించిందన్నారు
టీడీపీదే ఉద్యోగాల చరిత్ర“విద్యతోనే వికాసం, ఉద్యోగాలతోనే ఉపాధి అనే లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని శ్రీ ఎన్.రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. విద్యారంగాన్ని బలోపేతం చేయడం,నిరుద్యోగ నిర్మూలనకు కృషి చేయడం టీడీపీ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమని అన్నారు.గతంలో ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చి, అధికారంలో ఉన్న సమయంలో ఒక్క డీఎస్సీ కూడా ప్రకటించకుండా నిరుద్యోగులను మోసం చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వ వైఖరిని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందని అన్నారు.
మంత్రాలయం నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అందిస్తున్న ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, విద్యారంగ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని శ్రీ రాఘవేంద్ర రెడ్డి పిలుపునిచ్చారు

