వెంకటాపురం, వాజేడు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నియామకం.. ఏకగ్రీవంగా ఎన్నిక!
మంత్రి సీతక్క సూచనల మేరకు నూతన అధ్యక్షుల ప్రకటన
వెంకటాపురం అధ్యక్షులుగా సయ్యద్ హుసేన్, వాజేడు అధ్యక్షులుగా కాకర్లపూడి విక్రాంత్ ఎన్నిక
అభినందనలు తెలిపిన ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడకుల అశోక్
వెంకటాపురం (నూగురు), అక్టోబర్ 15 (ప్రజావాణి): రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీమతి ధనసరి అనసూయ (సీతక్క) గారి సూచనల మేరకు, ములుగు జిల్లాలోని వెంకటాపురం మరియు వాజేడు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను అధికారికంగా ప్రకటించారు. ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడకుల అశోక్ గారు ఈ నియామకాలను ఖరారు చేశారు. గురువారం రోజున ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రానికి చెందిన సయ్యద్ హుసేన్ గారిని వెంకటాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ప్రకటించారు. అదేవిధంగా, వాజేడు మండల కేంద్రానికి చెందిన కాకర్లపూడి విక్రాంత్ గారిని వాజేడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షులు పైడకుల అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు సయ్యద్ హుసేన్ మరియు కాకర్లపూడి విక్రాంత్ లకు ఆయన హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులన్నీ సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా సమన్వయంతో కలిసికట్టుగా ముందుకు సాగాలని, అన్ని స్థానాల్లో అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించేలా శ్రమించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

