📄 ePaper
Epaper 2
Wednesday, October 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకడవెండిలో ఎస్ఎస్సీ టాపర్స్‌కు ‘రేణుక @ మిడ్కో’ ప్రతిభా పురస్కారాలు

కడవెండిలో ఎస్ఎస్సీ టాపర్స్‌కు ‘రేణుక @ మిడ్కో’ ప్రతిభా పురస్కారాలు

📰 Generate e-Paper Clip

కడవెండిలో ఎస్ఎస్సీ టాపర్స్‌కు ‘రేణుక @ మిడ్కో’ ప్రతిభా పురస్కారాలు..

విద్యార్థులు సమాజాన్ని అర్థం చేసుకోవాలి.. ఏ.నరసింహారెడ్డి

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 14(ప్రజావాణి): జనగామ జిల్లా దేవరుప్పుల మండలం, కడవెండి గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సీలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గుముడవెల్లి ‘రేణుక @ మిడ్కో’ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగదు పురస్కారాలు అందజేశారు.

రేణుక @ మిడ్కో ఎవరు ?

1970 దశకంలో కడవెండి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చదివి అనంతరం విప్లవ రచయితగా, ఉద్యమ కార్యకర్తగా ఎదిగిన గుముడవెల్లి రేణుక అలియాస్ మిడ్కో 2025 మార్చి 31న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు. ఆమె స్మారకార్థం కుటుంబ సభ్యులు ‘రేణుక మెమోరియల్ ట్రస్ట్’ను ఏర్పాటు చేశామని రేణుక తండ్రి గుముడవెల్లి సోమయ్య తెలిపారు.

బుధవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్.ఎన్.రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఐదుగురు విద్యార్థులు
సమీక్ష – రూ.10 వేలు, రాంచరణ్ – రూ.10 వేలు, నిహారిక – రూ.7,500, అభిలాష్ – రూ.7,500, సింధు – రూ.5,000.
ట్రస్ట్ తరఫున నగదు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా పూర్వ ఉపాధ్యాయులు ఏ.నరసింహారెడ్డి మాట్లాడుతూ “విద్యార్థులు కేవలం మార్కులకే పరిమితం కాకూడదు. చదువుతో పాటు సమాజం పట్ల అవగాహన పెంచుకోవాలి. ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి. రేణుక @ మిడ్కో ఈ పాఠశాలలోనే చదివి ఎదిగింది. ఇక్కడి నుంచే ఆమెలో ఆలోచన, రచన, సమాజం పట్ల బాధ్యత మొదలయ్యాయి. ఒక సాధారణ గ్రామీణ విద్యార్థిని కూడా తన రచనల ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందవచ్చని నిరూపించింది. ప్రభుత్వ పాఠశాలల నుంచే గొప్ప వ్యక్తులు తయారవుతారని రేణుక జీవితమే నిదర్శనం. ఈ రోజు పురస్కారం అందుకున్న విద్యార్థులు రేణుక స్ఫూర్తితో ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలి. కానీ తమ గ్రామాన్ని, మట్టిని మర్చిపోకూడదు” అని పేర్కొన్నారు.

ఈ ఏడాది జులై 2న ట్రస్ట్ ఏర్పాటు చేశామని, ప్రతి ఏటా పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించే విద్యార్థులకు పురస్కారాలు కొనసాగిస్తామని సోమయ్య తెలిపారు. గత మూడు దశాబ్దాల్లో రేణుక చేసిన వ్యాసాలు, కథలు, రిపోర్టులు, ఉత్తరాల రూపంలో ఉన్న ముద్రిత, అముద్రిత రచనలన్నీ సేకరించి వేర్వేరు సంపుటాలుగా ప్రచురించనున్నట్లు చెప్పారు. ఆమె రచనలు ఎవరి వద్ద ఉన్నా తమకు అందజేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బాషిపాక రాములు, ఉపాధ్యాయ సంఘాల నేతలు శ్రీనివాస్, డి.నరసింహారెడ్డి, గ్రామస్తులు లీనారెడ్డి హాజరయ్యారు. రేణుక తల్లి జయమ్మ, సోదరుడు జీవీకే ప్రసాద్, గుముడవెల్లి లక్ష్మీనర్సయ్య దుబ్బక రత్నకర్ రెడ్డి, పెద్ది సోమయ్య, కాశ బోయిన యాకన్న, పెద్ది ఆంజనేయులు, కత్తుల సుధాకర్, గుముడవెల్లి సోమన్న, తదితరులు
పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.