నీటి వనరుల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
*మన ప్రజావాణి*
*మంచిర్యాల జిల్లా*:-
ప్రస్తుతం నెలకొన్న ఎల్ నినో ప్రభావంతో లోటు వర్షపాతం ఉన్నందున నీటి వనరుల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర వ్యవసాయ, సహకార, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రవాణా, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు నేస్తంలో భాగంగా అన్ని జిల్లాలలోని రైతు వేదికలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదు అయినందున నీటి వినియోగంపై అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రజలలో నీటి పొదుపు పై అవగాహన కల్పించాలని తెలిపారు. రబీ సీజన్ లో రైతులు వరి సాగు చేయవద్దని, బిందు సేద్యంతో ఆయిల్ పామ్, కూరగాయలు వంటి తక్కువ నీటి అవసరం ఉన్న పంటలను సాగు చేయాలని తెలిపారు. జలసిరి కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతలు, నీటి కుంటలు, ఊట కుంటలు, పంట కుంటల పనులు చేపట్టి జన వనరులను కాపాడుకోవాలని తెలిపారు. రాష్ట్రంలోని 315 మండలాలలో లోటు వర్షపాతం నమోదు అయిందని, వచ్చే వర్షాకాలం నాటికి త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా నీటిని పొదుపుగా వినియోగించాలని తెలిపారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాపై సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, భూగర్భ జల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్ నివేదికలను సమర్పించాలని తెలిపారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతుందని తెలిపారు
హాజీపూర్ మండలం గుడిపేటలోని రైతు వేదిక నుండి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా పశువైద్య శాఖ అధికారి, మండల ప్రత్యేక అధికారి యాకూబ్, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, జిల్లా ఉద్యానవన అధికారి అనిత లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎల్ నినో ప్రభావం, లోటు వర్షపాతం నమోదు, నీటి లభ్యత, వరి మినహా ఆరుతడి, ఆయిల్ పామ్, పందిరి సాగు వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు.
ప్రసార మాధ్యమాలు, కళాజాత బృందాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి అప్రమత్తం చేయడం జరుగుతుందని తెలిపారు
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు..

