ఘట్కేసర్, అక్టోబర్ 11 (ప్రజావాణి):వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు, కుంటలు నీటితో నిండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ ఘట్కేసర్లోని చిన్న చెరువు వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఘట్కేసర్ జామా మసీదు కమిటీ, బాలాజీనగర్‌లోని మహమ్మదియా మసీదు కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్థలంలో **సలాతుల్ ఇస్తిస్కా (వర్షాల కోసం చేసే ప్రత్యేక నమాజు)** నిర్వహించి అల్లాహ్‌ను వేడుకున్నారు.
ఈ సందర్భంగా రైతులకు మేలు జరగాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ప్రాంతంలో నీటి వనరులు పెరిగి పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థనలు చేశారు. ప్రకృతి కరుణించి సకాలంలో వర్షాలు కురవాలని భక్తిశ్రద్ధలతో నమాజు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ జామా మసీదు కమిటీ అధ్యక్షుడు సయ్యద్ అబ్దుల్ అజీజ్ (అను భాయ్), ప్రధాన కార్యదర్శి కుతుబుద్దిన్, మహమ్మదియా మసీదు అధ్యక్షుడు షాషాభాయ్, ప్రధాన కార్యదర్శి తాహెర్ అలీ, మసీదుల ఇమామ్‌లు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
