*రాబోయే లక్ష్యలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం*
* *మన ప్రజావాణి* మందమర్రి:-
పట్టణంలోని సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో మంగళవారం బొగ్గు ఉత్పత్తి, అభివృద్ధి, రాబోయే ఆర్థిక సంవత్సరాల లక్ష్యాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్పొరేట్ కార్యాలయం నుండి విచ్చేసిన ఆన్యువల్ ప్లాన్ కమిటీ, టార్గెట్ కమిటీ సభ్యులు జీఎం లు దేవేందర్, నరసింహారావు, డీజీఎం గాబ్రియేల్ రాజు, గని మేనేజర్ ప్రసాద్ లతో పాటు ఏడుగురు అసోసియేటెడ్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారికి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు సాధించిన నెలవారీ బొగ్గు ఉత్పత్తి, ఓవర్ బర్డెన్ తొలగింపు పురోగతిని, రాబోయే నెలల్లో సాధించాల్సిన లక్ష్యాలను కమిటీ సమగ్రంగా పరిశీలించింది. 2027-28 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన ఉత్పత్తి లక్ష్యాలు, కార్యాచరణ ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులలో బొగ్గు ఉత్పత్తి, ఓబీ తొలగింపుతో పాటు భూగర్భ గనులలో డెవలప్మెంట్, డిపిల్లరింగ్ పనుల పురోగతిపై సమీక్షించారు. ఉద్యోగులు, కార్మికుల ఉత్పాదకత, గనుల్లో భారీ యంత్రాల పనితీరుపై ఆరా తీశారు. గనుల విస్తరణకు కీలకమైన భూసేకరణ, పునరావాస చర్యలు, పర్యావరణ క్లియరెన్స్, అటవీ శాఖ అనుమతుల ప్రస్తుత స్థితిగతులను సమీక్షించారు.
లక్ష్య సాధనలో ఎదురవుతున్న ఆటంకాలను విశ్లేషించి, అవసరమైన వనరులు, కార్పొరేట్ మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఏరియాలోని వివిధ గనుల ఏజెంట్లు, ప్రాజెక్టు అధికారులు, గనుల మేనేజర్లు, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.

