*పితృకార్యాలు చేయకపోతే వంశానికే ముప్పు!*
*—-ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు ఆడెపు రాజమౌళి*
*రాయికల్, అక్టోబర్ 04 (ప్రజావాణి):*
సనాతన ధర్మంలో పితృదేవతల ఆరాధనకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదని, పితృకార్యాలను విస్మరిస్తే సొంత వంశమే నాశనమవుతుందని గరుడ పురాణం హెచ్చరిస్తోందని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, సామాజిక వేత్త, ఆధ్యాత్మిక వేత్త, దైవ రాధకుడు, సనాతన ధర్మ పరిరక్షకుడు ఆడెపు రాజమౌళి ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన గరుడ పురాణంలోని ఒక శక్తివంతమైన శ్లోకాన్ని ఉటంకించారు.
“స్వకులం పీడయేప్రేతః పరచ్ఛిద్రేణ పీడయేత్ | జీవన్స దృశ్యతే స్నేహీ మృతో దుష్టత్వమాప్నుయాత్||”
దీని అర్థం ఏమిటంటే బ్రతికి ఉన్నప్పుడు ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా ఉన్న మన పూర్వీకులే, మరణానంతరం వారికి చేయాల్సిన శ్రాద్ధ కర్మలు సరిగా చేయకపోతే ప్రేత రూపంలో తమ సొంత కులాన్ని, వంశాన్ని పీడిస్తారని, ఇతరుల ద్వారా కూడా ఆ వంశానికి కీడు కలిగిస్తారని ఈ శ్లోకం తెలియజేస్తోందని ఆయన వివరించారు.మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ వెంటనే పై లోకాలకు వెళ్లదని, కొంతకాలం ప్రేత రూపంలోనే భూమిపైనే తిరుగుతుందని గరుడ పురాణం చెబుతోందని, ఆ ప్రేత రూపం నుండి విముక్తి పొందాలంటే కొడుకులు, మనవలు చేసే పిండ ప్రదానం, తర్పణం, శ్రాద్ధ కర్మలే మార్గమని అన్నారు. ఈ కర్మలు చేయకపోతే ఆ ఆత్మలకు మోక్షం లభించదని, మోక్షం లభించని ఆ ఆత్మలే కోపంతో తమ వంశంలోని వారిని పట్టి పీడిస్తాయని, దీనినే పితృదోషం అంటారని, దీని వల్ల కుటుంబంలో ఎప్పుడూ అశాంతి, కారణం లేని అనారోగ్య సమస్యలు, ధన నష్టం, ఉద్యోగంలో ఆటంకాలు, సంతానం లేకపోవడం, పిల్లలు చెడు మార్గంలో వెళ్లడం వంటి సమస్యలు వస్తాయని ఆడెపు రాజమౌళి పేర్కొన్నారు.అలాగే మరణించిన తర్వాత చేయాల్సిన కర్మల గురించి కూడా ఆయన వివరించారు. దహన సంస్కారం తర్వాత 11 రోజుల పాటు చేసే కర్మలు ఆత్మకు కొత్త సూక్ష్మ దేహాన్ని ఇస్తాయని, ప్రతి నెలా చేసే మాసికాలు, ఏడాది తర్వాత చేసే సంవత్సరీకాలు ఆత్మకు బలాన్ని చేకూరుస్తాయని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న మహాలయ పక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన రోజులని, ఈ 15 రోజుల్లో చేసే తర్పణాలు, ముఖ్యంగా మహాలయ అమావాస్య రోజున చేసే పిండ ప్రదానం నేరుగా పితృదేవతలకు చేరి వారిని సంతృప్తి పరుస్తుందని చెప్పారు
ముఖ్యంగా ఆత్మహత్యల ద్వారా, రోడ్డు ప్రమాదాల ద్వారా, అకాల మరణం పొందిన వారి ఆత్మలు మరింత తీవ్రంగా ప్రేత రూపంలో బాధపడతాయని, అలాంటి వారికి నారాయణ బలి, నాగ బలి, త్రిపిండి శ్రాద్ధం వంటి ప్రత్యేక ప్రాయశ్చిత్త కర్మలు చేయడం వల్లనే వారికి శాంతి లభిస్తుందని శాస్త్రం చెబుతోందన్నారు.చివరగా ఆయన మాట్లాడుతూ పితృకార్యాలు అంటే కేవలం భయంతో చేసేవి కావని, మనకు జన్మనిచ్చి, మనల్ని పెంచి పెద్ద చేసిన మన పూర్వీకుల పట్ల మనం చూపించే కృతజ్ఞత, బాధ్యత అని, పితృదేవతలను సంతోషపెడితే వారి ఆశీర్వాదంతో మన వంశం సుఖ, శాంతి, సౌభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుందని తెలిపారు.

